
శ్రీనగర్: భక్తులకు శ్రీ మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్ర బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో నిలిచిపోయిన శ్రీవైష్ణో దేవి యాత్రను తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. 2025, సెప్టెంబర్ 14 నుంచి వైష్ణోదేవీ తీర్థ యాత్ర పున: ప్రారంభం అవుతుందని వెల్లడించింది ఆలయ బోర్డు.
గత ఆగస్టు నెలలో కొండచరియలు విరిగిపడటం, క్లౌడ్ బరస్ట్ వంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా రియాసి జిల్లాలోని శ్రీవైష్ణోదేవీ తీర్థయాత్ర 19 రోజులుగా నిలిచిపోయింది. వర్షాలు, వరదలు తగ్గడంతో అధికారులు యాత్ర మార్గాన్ని పునరుద్ధరించారు. ఈ క్రమంలోనే వైష్ణోదేవీ తీర్ధయాత్రను తిరిగి ప్రారంభిస్తున్నారు. అయితే.. అనుకూల వాతావరణ పరిస్థితులకు లోబడి యాత్ర ఉంటుందని భక్తులకు సూచించింది ఆలయ బోర్డు. పూర్తి వివరాల కోసం www.maavaishnodevi.org ని సందర్శించాలని సూచించింది.
2025 ఆగస్టులో భారీ వర్షాలు, వరదలు జమ్మూ కాశ్మీర్‌ను అతలాకుతలం చేశాయి. క్లౌడ్ బరస్ట్ ధాటికి జమ్మూ కాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ముఖ్యంగా రియాసి జిల్లాలో కుండపోత వాన బీభత్సం సృష్టించింది. ఆగస్టు 26న కురిసిన రికార్డ్ స్థాయి వర్షానికి రియాసి జిల్లాలోని త్రికూట కొండలపై పెద్ద కొండచరియలు విరిగిపడ్డాయి.
►ALSO READ | దేశవ్యాప్తంగా క్రాకర్స్ నిషేధించాలి: సుప్రీంకోర్టు కీలకవ్యాఖ్యలు
ఈ దుర్ఘటనలో 34 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది భక్తులు గాయపడ్డారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే వైష్ణోదేవి యాత్రను నిలిపివేశారు. శ్రీవైష్ణోదేవీ యాత్ర మార్గాన్ని పూర్తిగా మూసివేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో అధికారులు వైష్ణోదేవి యాత్ర మార్గాన్ని పునరుద్ధరించడంతో తిరిగి భక్తులకు దర్శన అవకాశం కల్పిస్తున్నారు.