
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే అభిమానులకు పండగే. ఇటీవల విడుదలైన 'హరిహర వీరమల్లు' బాక్సాఫీస్ వద్ద కాస్త నిరాశ పరిచింది. కానీ ఇప్పుడు సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ‘ఓజీ’ (OG) చిత్రంపై అంచనాలు ఆకాశాన్నంటాయి. సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అది క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విలన్ థీమ్ సాంగ్ ‘ట్రాన్స్ ఆఫ్ ఓమి’
లేటెస్ట్ గా ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేలా చిత్ర యూనిట్ తాజాగా విలన్ పాత్రధారి ఇమ్రాన్ హష్మీ నేపథ్యంగా ‘ట్రాన్స్ ఆఫ్ ఓమి’ (Trance of OMI) అనే మ్యూజికల్ సాంగ్‌ను విడుదల చేసింది. ఈ పాట ఇమ్రాన్ హష్మీ క్యారెక్టర్ డెప్త్‌ను పవర్‌ఫుల్‌గా వర్ణిస్తోంది. 2 నిమిషాల 53 సెకన్ల నిడివి ఉన్న ఈ పాటలో కేవలం ఇన్‌స్ట్రుమెంటల్ మ్యూజిక్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం విశేషం. దీనికి అద్వితీయ సాహిత్యం అందించగా హర్ష, శ్రుతి రంజని, ప్రణతి, శ్రుతిక వంటి గాయకులు ఆలపించారు. థమన్ సంగీతం ఈ పాటకు మెయిన్ హైలైట్‌గా నిలిచింది. ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ, అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డులు
విడుదల తేదీకి ఇంకా కొన్ని రోజు ఉన్నా..ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ సినిమా సృష్టిస్తున్న సంచలనం చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికాలో ‘ఓజీ’ అడ్వాన్స్ బుకింగ్‌లు నెల రోజుల ముందే మొదలయ్యాయి. ఇప్పటికే ఈ చిత్రం 1.25 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 10.4 కోట్ల) వసూళ్లను సాధించింది. ఇది ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు దక్కని ఘనత. ట్రేడ్ ఎనలిస్ట్‌ల అంచనా ప్రకారం, విడుదల సమయానికి ఈ కలెక్షన్లు 2.5 మిలియన్ డాలర్లను దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతున్నారు.
►ALSO READ | మరోసారి తన భక్తిని చాటుకున్న ఇళయరాజా... అమ్మవారికి రూ. 8 కోట్ల విలువైన కానుకలు విరాళం!
ఈ మూవీలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ నటించింది. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, అర్జున్ దాస్ వంటి అగ్ర నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్ టైనర్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్, సుజీత్, థమన్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఓ కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు..