
- మెంబర్ టెక్నికల్‌గా మారుస్తూ ఉత్తర్వులు
- మెంబర్‌గా ఉన్న ఆర్కే కనోడియాకు మెంబర్ సెక్రటరీగా ప్రమోషన్
- తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో అళగేశన్పై కేంద్రం చర్యలు
హైదరాబాద్, వెలుగు: గోదావరి రివర్ మేనేజ్మెంట్బోర్డు (జీఆర్ఎంబీ) మెంబర్ సెక్రటరీని కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఇప్పటివరకు ఆ పదవిలో కొనసాగుతున్న అళగేశన్ ను మెంబర్‌గా డిమోట్ చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఆయన స్థానంలో మెంబర్‌గా కొనసాగుతున్న ఆర్కే కనోడియాను మెంబర్ సెక్రటరీగా ప్రమోట్ చేసింది. అళగేశన్పై కొన్నాళ్లుగా తీవ్రమైన ఆరోపణలు వస్తుండడంతో కేంద్ర జలశక్తి శాఖ ఈ చర్యలు తీసుకుంది. కొద్ది రోజుల క్రితం బోర్డు అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలపై జలశక్తి శాఖ అడిషనల్ సెక్రటరీ సుబోధ్ యాదవ్ రివ్యూ చేసిన సంగతి తెలిసిందే. ఆ రివ్యూలో అళగేశన్పై ఫిర్యాదుల మీద కూడా చర్చించినట్టు తెలిసింది. ఆయన వ్యవహారశైలిపై కేంద్రానికి రిపోర్టు ఇవ్వడం వల్లే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్.. ఆయన్ను మెంబర్ సెక్రటరీగా తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
అళగేశన్పై తీవ్ర ఆరోపణలు
అళగేశన్ మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉన్నారు. అవి ఇటీవలి కాలంలో తీవ్రమయ్యాయి. మహిళా ఉద్యోగులను వేధించడంతోపాటు బోర్డులోని ఉద్యోగులను ఏదో ఒక విషయంలో వేధించేవారని ఆరోపణలు ఉన్నాయి. మహిళా అధికారుల వస్త్రధారణపైనా అసభ్యంగా వ్యాఖ్యలు చేసేవారని చెబుతుంటారు. అంతేకాకుండా ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న వాదన కూడా ఉన్నది. ట్రాన్స్‌పోర్టు అలవెన్సు తీసుకుంటూనే ప్రభుత్వ వాహనాన్ని వాడుకోవడం, ఏదైనా ట్రిప్ కోసం వెళ్లినప్పుడు కారు చార్జీల రూపంలో వేల రూపాయలు డ్రా చేయడం, కంటి సర్జరీ కాకుండానే బిల్లులు డ్రా చేయడం వంటి ఆరోపణలున్నాయి. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకం విషయంలోనూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారన్న విమర్శలున్నాయి. దీంతో బోర్డు ఉద్యోగులు గత ఫిబ్రవరిలో బోర్డు చైర్మన్‌తోపాటు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి, కార్యదర్శులకు ఫిర్యాదు చేశారు.
బోర్డు మీటింగుల్లోనూ మన అధికారుల డిమాండ్లు
అళగేశన్ తీరుపై బోర్డు మీటింగుల్లో మన అధికారులు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈఎన్సీ స్థాయి అధికారికీ కనీస గౌరవం ఇవ్వకుండా వ్యవహరించేవారని బోర్డు ముందు వాదించారు. ఆయన వ్యవహారశైలిపై విచారించేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీ వేయాలని నిర్ణయించినా.. ఆ కమిటీకి అతీగతీ లేదు. ఇటీవల జరిగిన బోర్డు మీటింగ్‌లో దానిపై పట్టుబట్టినా మీటింగ్ మినిట్స్ నుంచి అసలు ఆ అంశాన్నే ఎత్తేశారు. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర జలశక్తి శాఖ అళగేశన్‌ను డిమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.