ప్రేమిస్తున్నానంటూ ఆర్‌‌ఎంపీ వేధింపులు.. యువతి ఆత్మహత్య

ప్రేమిస్తున్నానంటూ ఆర్‌‌ఎంపీ వేధింపులు.. యువతి ఆత్మహత్య
  • ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో ఘటన

కారేపల్లి, వెలుగు : ప్రేమిస్తున్నానంటూ ఓ ఆర్‌‌ఎంపీ వేధించడంతో యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గేట్‌‌రేలకాయలపల్లి గ్రామంలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన జర్పుల సందీప్తి (20) ఖమ్మంలో డిగ్రీ చదువుతోంది. 

ఏన్కూరు మండలం కేసుపల్లి గ్రామానికి చెందిన నామా నరేశ్‌‌ గేట్‌‌రేలకాయలపల్లి ప్రాంతంలో ఆర్‌‌ఎంపీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో నరేశ్‌‌కు సందీప్తితో పరిచయం కాగా.. గతంలో ఇద్దరూ కలిసి ఫొటోలు తీసుకున్నారు. తర్వాత నరేశ్‌‌ ప్రేమిస్తున్నాను, పెండ్లి చేసుకుంటానంటూ సందీప్తిని వేధించడం మొదలుపెట్టాడు. 

తాను ఒప్పుకోకపోవడంతో ఫొటోలు బయటపెడుతానంటూ బెదిరించాడు. ఈ విషయాన్ని యువతి తన కుటుంబసభ్యులకు చెప్పగా.. వారు ఈ నెల ఆరున కారేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నరేశ్‌‌పై కేసు నమోదు అయింది.

 ఈ క్రమంలోనే గురువారం సందీప్తి తన ఇంట్లో పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు కొత్తగూడెం హాస్పిటల్‌‌కు తరలించగా.. అక్కడ ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకుంటూ శుక్రవారం చనిపోయింది. తన కూతురు మృతికి ఆర్‌‌ఎంపీ నరేశ్‌‌ కారణమంటూ మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై గోపీ తెలిపారు.