అమెరికాలో రోడ్డు ప్రమాదం..సూర్యాపేట వాసి మృతి

అమెరికాలో రోడ్డు ప్రమాదం..సూర్యాపేట వాసి మృతి
  • కారులో ప్రయాణిస్తున్న నల్గొండ జిల్లాకు చెందిన మరో వ్యక్తికి తీవ్ర గాయాలు

సూర్యాపేట జిల్లా: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో సూర్యాపేట వాసి మృతి చెందాడు. అమెరికాలోని ఒహయో రాష్ట్రంలో సూర్యాపేట జిల్లాకు చెందిన నరేంద్రుని చిరు సాయి ఉద్యోగం చేస్తున్నాడు. షాపింగ్ చేసుకొని రూమ్ కి వెళ్తున్న సమయంలో చిరు సాయి ప్రయాణిస్తున్న కారును టిప్పర్ కొట్టింది. తీవ్రంగా మంచు కురుస్తుండడంతో టిప్పర్ వేగంగా వచ్చి కారును ఢీకొట్టడంతో చిరుసాయి ఘటనా స్థలంలోనే కన్నుమూశాడు. ప్రమాద సమయంలో చిరు సాయితో కలసి ప్రయాణిస్తున్న నల్గొండ జిల్లాకు చెందిన మరొక వ్యక్తి తీవ్రంగా  గాయపడగా ఆస్పత్రికి తరలించారు. ఆ వ్యక్తి కోమాలో ఉన్నట్లు సమాచారం.

సూర్యాపేటకు చెందిన లింగమూర్తి, సుధారాణి దంపతుల ఏకైక కుమారుడు చిరుసాయి. ఏడాదిన్నర క్రితమే ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. ఒక్కగానొక్క కొడుకు రోడ్డుప్రమాదంలో చనిపోవడంతో కన్నతల్లితండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మృతుడి కుటుంబ సభ్యులను మంత్రి జగదీష్ రెడ్డి పరామర్శించారు. అలాగే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు, బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి సంకినేని వరుణ్ రావు తదితరులు సూర్యాపేటలో నివసిస్తున్న చిరుసాయి తల్లిదండ్రులను పరామర్శించారు.  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో మాట్లాడి డెడ్ బాడీ ని ఇండియా కి తీసుకొస్తామని హామీ ఇచ్చి ఓదార్చారు.