మార్నింగ్ వాక్ చేస్తుండగా.. దూసుకొచ్చిన కారు

మార్నింగ్ వాక్ చేస్తుండగా.. దూసుకొచ్చిన కారు
  • అక్కడికక్కడే తల్లీ బిడ్డ మృతి.. మరో మహిళకు తీవ్ర గాయాలు 
  •     హైదరాబాద్ సన్ సిటీలో విషాదం
  •     ఓవర్ స్పీడ్ తో వచ్చిన కారు.. మహిళలను ఢీకొట్టిన వీడియోలు వైరల్   
  •     ఒక్కరోజే రోడ్డు ప్రమాదాల్లో 11 మంది మరణం  
  •     జీహెచ్​ఎంసీ పరిధిలో ఆరుగురు.. జిల్లాల్లో ఐదుగురు   

గండిపేట/ఇబ్రహీంపట్నం/హైదరాబాద్, వెలుగు : ఇద్దరు తల్లీబిడ్డలు. రోజూ మాదిరిగానే పొద్దున్నే లేచి మార్నింగ్ వాక్ కు బయలుదేరారు. పక్కింట్లో ఉండే మరొకామె వారితో కలిశారు. ఎప్పట్లాగే ముగ్గురూ రోడ్డు పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో వెనక నుంచి ఓవర్ స్పీడ్ తో దూసుకొచ్చిన కారు.. క్షణాల్లో వారిని బలంగా ఢీకొట్టుకుంటూ వెళ్లిపోయింది. తల్లీబిడ్డలు అక్కడికక్కడే మరణించగా, పక్కింటామె తీవ్ర గాయాలతో దవాఖానలో ట్రీట్మెంట్ పొందుతోంది. హైదరాబాద్ లోని హైదర్షాకోట్ సన్ సిటీ ఏరియాలో మంగళవారం ఉదయం ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో సన్ సిటీ ఏరియాలోని లక్ష్మీనర్సింహా కాలనీకి చెందిన నెమలి అనురాధ(45), ఆమె బిడ్డ నెమలి మమత(25) మృతిచెందారు. అదే కాలనీకి చెందిన కవిత అనే మహిళ తీవ్రంగా గాయపడింది. 

మమత ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ చేస్తోంది. ముగ్గురు మహిళలు నడుచుకుంటూ వెళ్తుండటం.. వెనక నుంచి కారు దుమ్ము రేపుకుంటూ దూసుకొచ్చి వారిని ఢీకొడ్తూ వెళ్లిన సీసీటీవీ ఫుటేజీ వీడియోలు వైరల్ అయ్యాయి. అలాగే మంగళవారం గ్రేటర్ పరిధిలోని ఇబ్రహీంపట్నంలో కారు బైక్ ను ఢీకొట్టడంతో ముగ్గురు బీటెక్ స్టూడెంట్లు చనిపోయారు. ఓల్డ్ సిటీలో బైక్ అదుపుతప్పి కిందపడి మరో వ్యక్తి మృతిచెందాడు. సంగారెడ్డి జిల్లాలో డీసీఎం బైకులను ఢీకొట్టడంతో ఇద్దరు.. కరీంనగర్ జిల్లాలో ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టి ముగ్గురు మృతిచెందారు. రాష్ట్రంలో ఒక్కరోజే ఇలా యాక్సిడెంట్లలో 11 మంది మరణించారు.   

బర్త్ డే జోష్ లో ఓవర్ స్పీడ్ 

ప్రమాద సమయంలో కారులో నలుగురు యువకులు ఉన్నారు. బర్త్ డే జోష్ లో ఓవర్ స్పీడ్ తో కారును నడిపి ప్రమాదానికి కారణమైన బదియుద్దీన్ ఖాద్రి(19)ని, అతడికి లైసెన్స్ లేకున్నా డ్రైవింగ్ చేసేందుకు తన కారును ఇచ్చిన అతడి ఫ్రెండ్ అబ్దుల్ రెహమాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మాసబ్ ట్యాంక్ కు చెందిన ఖాద్రి బీబీఏ ఫస్టియర్ చదువుతున్నాడు. మంగళవారం తన బర్త్ డే కావడంతో ముగ్గురు ఫ్రెండ్స్ తో కలిసి మొయినాబాద్ లోని ఓ ఫాంహౌస్ కు కారులో బయలుదేరాడు. ఉదయం 6.30 గంటలకు అనురాధ, మమత, కవిత వాకింగ్ కు వెళ్లారు. ముగ్గురూ ఇంటి నుంచి రోడ్డు మీదకు రాగానే ఓవర్ స్పీడ్ తో కారు డ్రైవ్ చేస్తూ వచ్చిన ఖాద్రి వారిని ఢీకొట్టాడు. అనురాధ, మమత అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ కవితను దగ్గరలోని హాస్పిటల్ కు తరలించారు. 

ఖాద్రీతో పాటు అతడి ఫ్రెండ్స్ ముగ్గురిని నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారును స్వాధీనం చేసుకున్నారు. కారులో కత్తి కూడా ఉండటంపై ప్రశ్నించగా.. దానిని కేక్ కట్టింగ్ కోసమే తీసుకెళ్తున్నట్లు ఖాద్రి ఫ్రెండ్స్ పోలీసులకు తెలిపారు. ఖాద్రి బర్త్ డేను సోమవారం అర్ధరాత్రే సెలబ్రేట్ చేయాలనుకున్నామని.. అతడికి ఫీవర్ ఉండటంతో మంగళవారం ఉదయం అందరూ కలిసి ఫాంహౌస్ కు బయలుదేరినప్పుడు యాక్సిడెంట్ జరిగిందని చెప్పారు. తల్లీబిడ్డల మృతితో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. అనురాధ, మమత అందరితో కలుపుగోలుగా ఉండేవారని, దోషులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.