
మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఆటో ఢీకొనడంతో ఆటోలో ఉన్న ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈఘటన గుడూరు మండలం మర్రిమిట్టలో చోటుచేసుకుంది. మృతుల్లో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారుగా, మరొకరు ఆటో డ్రైవర్ గా గుర్తించారు. పెళ్లి బట్టలు కొనేందుకు వరంగల్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు సమాచారం తెలుసుకుని సంఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
కాగా ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతి చెందారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సేవలు తక్షణమే అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.