అమరావతి: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు స్పాట్లోనే చనిపోగా.. మరో ఇద్దరు తీవ్రం గాయపడ్డారు. శుక్రవారం (డిసెంబర్ 26) తెల్లవారుజూమున నల్లగట్ల విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొని ఎదురుగా వస్తున్న సీజీఆర్ ప్రైవేట్ ట్రావెల్ బస్సును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తోన్న ఆరుగురిలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా వారి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహకయ చర్యలు చేపట్టారు. కారులో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీశారు.
గాయపడిన ఇద్దరిని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులను హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. అనంతరం ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. క్రేన్ సాయంతో వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు పోలీసులు.
