తగ్గిన యాక్సిడెంట్లు.. నిరంతర చర్యలతో ఫలితాలు సాధించిన జిల్లా పోలీస్ శాఖ

తగ్గిన యాక్సిడెంట్లు..  నిరంతర చర్యలతో ఫలితాలు సాధించిన జిల్లా పోలీస్ శాఖ
  • ఈ ఏడాది స్వల్పంగా తగ్గిన ప్రమాదాలు
  • మద్యం సేవించి వెహికల్స్​ నడుపకుండా తనిఖీలు

కామారెడ్డి, వెలుగు: రోడ్డు ప్రమాదాల నివారణపై జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. నిరంతర పర్యవేక్షణతో పాటు బ్లాక్ స్పాట్స్ గుర్తించి లోపాలను సరిదిద్దింది.  డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారికి జరిమానాలు విధిస్తుండడంతో ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గింది. జిల్లా మీదుగా రెండు నేషనల్ హైవేలతో పాటు స్టేట్ హైవేలు, జిల్లా, మండల రహదారులు ఉన్నాయి. గతంలో వీటిపై వందల సంఖ్యలో  ప్రాణనష్టం సంభవించేది.

 ఓవర్ స్పీడ్, మద్యం సేవించి వాహనాలు నడపడం, రాంగ్ రూట్‌‌‌‌‌‌‌‌లో వెళ్లడం, అలసటతో డ్రైవింగ్ చేయడం, ఆటోల్లో కెపాసిటీకి మించి ప్రయాణికులను ఎక్కించడం, ప్రమాదకర మూలమలుపులు, రోడ్ల దుస్థితి వంటి కారణాలు ప్రమాదాలకు దారితీసేవి. భిక్కనూరు, కామారెడ్డి, దేవునిపల్లి, సదాశివనగర్, మాచారెడ్డి, నిజాంసాగర్, ఎల్లారెడ్డి, పిట్లం, మద్నూర్, బాన్సువాడ స్టేషన్ల పరిధిలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయి. రోడ్డు ప్రమాదాలపై 3 నెలలకొసారి అధికార యంత్రాంగం మీటింగ్​ నిర్వహిస్తోంది. కలెక్టర్, ఎస్పీతో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొంటారు.  జిల్లాలో యాక్సిడెంట్లు తగ్గడంతో ఇటీవల డీజీపీ జితేందర్​ జిల్లా పోలీస్​ యంత్రాంగాన్ని ప్రశంసించారు. 

  • పోలీస్​ శాఖ తీసుకున్న చర్యలు..  
  • హైవేపై స్పీడ్ లిమిట్‌‌‌‌‌‌‌‌ను 80కి కుదించడం. 
  • ఆయా ప్రాంతాల్లో స్పీడ్ గన్స్ ఏర్పాటు చేసి ఓవర్ స్పీడ్‌‌‌‌‌‌‌‌కు రూ.1,000 జరిమానా విధించడం. 
  • ప్రమాదాలు ఎక్కువగా జరిగే హైవే ప్రాంతాల్లో యూ-టర్న్‌‌‌‌‌‌‌‌లు మూసివేయడం. 
  • బ్లాక్ స్పాట్స్‌‌‌‌‌‌‌‌ గుర్తించి ఇంజినీరింగ్ లోపాలు సరిదిద్దడం. 
  • మూలమలుపుల్లో హెచ్చరిక బోర్డులు, రాత్రివేళల్లో రేడియం లైటింగ్ ఏర్పాటు చేయడం. 
  • డ్రంక్ అండ్ డ్రైవ్ నిరంతరం నిర్వహించి కేసులు నమోదు చేయడం. 

ఈ ఏడాది 7 నెలల్లో 6,800 మంది డ్రంక్ అండ్ డ్రైవ్‌‌‌‌‌‌‌‌లో పట్టుబడ్డారు. ఈ నెల 22న జరిగిన కోర్టు విచారణలో 91 మందికి శిక్షలు విధించగా, వారిలో 16 మందికి ఒక రోజు జైలు శిక్ష, ఒకరికి రెండు రోజుల జైలు శిక్ష, మిగిలిన 74 మందికి రూ.1,100 చొప్పున జరిమానాలు విధించారు. 

ఈ ఏడాది 7 నెలల్లో ప్రమాదాల తగ్గుదల ఇలా.. 

ఏడాది    ప్రమాదాలు    మృతులు    క్షతగాత్రులు
2024          170                    179              315
2025          129                    135              272

నిరంతర పర్యవేక్షణతో తగ్గిన ప్రమాదాలు..

నిరంతర పర్యవేక్షణతో ప్రమాదాలు తగ్గాయి. విస్తృత తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ కట్టడి, మైనర్లు వాహనాలు నడపకుండా నియంత్రణ, ప్రమాదాల ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాం. ప్రజలు రహదారి భద్రత నియమాలు పాటించాలి. రాజేశ్ చంద్ర, ఎస్పీ