మూడు రోడ్డు ప్రమాదాల్లో..ఎనిమిది మంది మృతి

మూడు రోడ్డు ప్రమాదాల్లో..ఎనిమిది మంది మృతి
  • భద్రాచలంలో బ్రిడ్జిపై నుంచి పడిన వెహికల్​
  • నలుగురు దుర్మరణం.. మృతుల్లో తండ్రి, ఇద్దరు కొడుకులు
  • నల్గొండ జిల్లాలో ఇద్దరు యువకులు మృత్యువాత
  • మంచిర్యాల జిల్లాలో బైక్​ను ఢీకొట్టి లారీ.. దంపతులు దుర్మరణం

బూర్గంపహాడ్/నకిరేకల్/మంచిర్యాల, వెలుగు : రాష్ట్రంలో బుధవారం జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మొత్తం ఎనిమిది మంది చనిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడ్ వద్ద జరిగిన యాక్సిడెంట్​లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో తండ్రి, ఇద్దరు కొడుకులు ఉన్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్ టౌన్​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు చనిపోయారు. బైక్​ను వెనుక నుంచి బొలేరో వెహికల్ ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం గుల్లకోట గ్రామం వద్ద జరిగిన యాక్సిడెంట్​లో భార్యాభర్తలు మృతి చెందారు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడ్ శివారులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు చనిపోయారు. మృతుల్లో తండ్రితో పాటు ఇద్దరు కొడుకులు ఉన్నారు. మరో నలుగురు చిన్నారులు, ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. టాటాఏస్‌‌ వెహికల్ కిన్నెరసాని బ్రిడ్జిపై నుంచి పడటంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్​లోని ఏలూరు జిల్లా టీ నర్సాపురం మండలం తిరుమలదేవిపేట గ్రామానికి చెందిన దాసరి నరసింహారావు, జట్ల దుర్గారావు, పచ్చిసాని శ్రీనివాసరావు కుటుంబాలకు చెందిన మొత్తం 12 మంది రాములోరిని దర్శించుకునేందుకు మంగళవారం టాటా ఏస్ వెహికల్​లో భద్రాచలం వచ్చారు. దర్శనం చేసుకున్న తర్వాత బుధవారం మధ్యాహ్నం తిరుమలదేవిపేట గ్రామానికి బయలుదేరారు.

 వీరు ప్రయాణిస్తున్న టాటా ఏస్ వెహికల్ అదుపు తప్పి ఏపీ–తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన కిన్నెరసాని బ్రిడ్జిపై నుంచి కిందపడింది. 60 అడుగుల లోతు ఉండటంతో దుర్గారావు (43), పచ్చిసాని శ్రీనివాస రావు (40)స్పాట్​లోనే చనిపోయారు. మిగిలిన వారందరికీ తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గాయపడిన వారిని భద్రాచలం ఏరియా హాస్పిటల్​కు తరలించారు. దుర్గారావు ఇద్దరు కొడుకులు సందీప్ (10), ప్రదీప్​ (8) పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ చనిపోయారు. నలుగురు చిన్నారుల హెల్త్ కండిషన్ క్రిటికల్​గా ఉందని డాక్టర్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందా.. లేక మరేదైనా కారణం ఉందా అనే కోణాల్లో విచారణ చేస్తున్నారు. బూర్గంపాడు ఎస్ఐ సంతోష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బైక్​ను ఢీకొట్టిన బొలెరో వెహికల్

నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని తాటికల్ రోడ్డు హైవే ఫ్లై ఓవర్​పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు చనిపోయారు. తాటికల్ గ్రామానికి చెందిన నల్ల మాదరాజు (28), భీమనబోయిన విజయ్ (34) బైక్​పై నకిరేకల్​ వెళ్తున్నారు. నల్గొండ నుంచి నకిరేకల్ వైపు వెళ్తున్న బొలెరో వెహికల్​ వీరి బైక్​ను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో రాజు స్పాట్​లోనే చనిపోయాడు. విజయ్​ను అంబులెన్స్​లో నకిరేకల్ గవర్నమెంట్ హాస్పిటల్​కు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. బైక్​ను ఢీకొట్టిన బొలెరో వెహికల్.. తర్వాత రోడ్డు పక్కన ఆగి ఉన్న మరో కారును కూడా ఢీకొట్టింది. మృతులు రాజుకు కొడుకు, విజయ్​కు కూతురు ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

భార్యాభర్తలు దుర్మరణం

మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం గుల్లకోట గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు చనిపోయారు. దండేపల్లి మండలం కొత్త మామిడిపల్లికి చెందిన బత్తుల శంకరయ్య (60), లచ్చవ్వ (55) వేంపల్లిలో ఉన్న పెండ్లికి అటెండ్​ అయ్యారు. తిరిగి కొత్త మామిడిపల్లికి వస్తుండగా.. వీరి బైక్​ను లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శంకరయ్య, లచ్చవ్వ స్పాట్​లోనే చనిపోయారు. పోలీసులు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నారు..