వణికిస్తున్న రోడ్డు ప్రమాదాలు..రోజుకో ప్రాణం బలి

వణికిస్తున్న రోడ్డు ప్రమాదాలు..రోజుకో ప్రాణం బలి
  •      వరంగల్ కమిషనరేట్ లో దడ పుట్టిస్తున్న యాక్సిడెంట్లు
  •     సగటున రోజుకు నాలుగు ప్రమాదాలు.. ఒక డెత్
  •     ఒక్క ఎల్కతుర్తి చుట్టుపక్కలే గత ఐదు రోజుల్లో 4 ఘటనలు.. ఏడు మరణాలు
  •     బ్లాక్​ స్పాట్లపై దృష్టి పెట్టని అధికారులు
  •     నామమాత్రపు చర్యలకే పరిమితం
  •     గడిచిన ఐదేండ్లలో 2 వేల మందికిపైగా మృతి

హనుమకొండ, వెలుగు : వరంగల్ కమిషనరేట్​ లో రోడ్డు ప్రమాదాలు దడ పుట్టిస్తున్నాయి. సెల్ప్​మిస్టేక్స్​తో పాటు ఇతర కారణాల వల్ల యాక్సిడెంట్లు జరుగుతుండగా ఏటా వందల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. కమిషనరేట్​ పరిధిలోని వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో సగటున రోజుకు నాలుగు రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతుండగా.. కనీసం ఒక్కరైనా ప్రాణాలు కోల్పోతున్నారు.

దీంతో ఏటా ప్రమాదాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. కాగా రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల కోసం బ్లాక్​ స్పాట్లను గుర్తిస్తున్న ఆఫీసర్లు ఆ తరువాత వాటిపై దృష్టి పెట్టడం లేదు. కనీసం హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయడం లేదు. దీంతో రహదారులపై నెత్తుటి దారలు ఏరులై పారుతున్నాయి. 

భయపెడుతున్న వరంగల్-కరీంనగర్​ రోడ్డు

నేషనల్​ హైవే-563లోని వరంగల్- కరీంనగర్​ మార్గంలో ఇటీవల వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. గత శుక్రవారం నుంచి మంగళవారం వరకు ఐదు రోజుల్లోనే ఈ రూట్​ లో నాలుగు మేజర్​ యాక్సిడెంట్లు జరిగాయి. ఎల్కతుర్తి చుట్టుపక్కల   ఈ నాలుగు ప్రమాదాలు చోటుచేసుకోగా.. ఒక ప్రమాదంలో ఐదుగురు, మరో ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇంకో నలుగురు గాయాలతో ఆసుపత్రిలో చేరారు. దీంతో ఈ మార్గంలో ప్రయాణించాలంటేనే జనాలు బెంబేలెత్తిపోతున్నారు. వాస్తవానికి హసన్ పర్తి నుంచి ఎల్కతుర్తి వరకు గతంలో కూడా పెద్ద ఎత్తున ప్రమాదాలు జరగగా..

అప్పటి అధికారులు డేంజరస్​ గా ఉన్న తొమ్మిది మూలమలుపులను గుర్తించారు. ఆయా చోట్లా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. కాలక్రమేణా బోర్డులు తొలగిపోగా.. ఆ తరువాత ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో ఈ మార్గంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

బ్లాక్ స్పాట్లు గుర్తించడం వరకే

కమిషనరేట్​ పరిధిలోని వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఆఫీసర్లు ఇదివరకు 24 బ్లాక్ స్పాట్లను గుర్తించారు. అందులో హనుమకొండ జిల్లాలో 14, వరంగల్ జిల్లాలో 10 ప్రాంతాలున్నాయి. ఇందులో హనుమకొండ జిల్లా పరిధిలోకి వచ్చే రింగ్ రోడ్డుపై రాంపూర్ క్రాస్, టేకులగూడెం క్రాస్, వంగపహాడ్ క్రాస్; కాజీపేట జంక్షన్ నుంచి ఫాతిమా, వడ్డేపల్లి క్రాస్ నుంచి జులైవాడ, నక్కలగుట్ట జంక్షన్, మర్కజీ సెంటర్ నుంచి అలంకార్ సెంటర్, పెద్దమ్మగడ్డ జంక్షన్, హంటర్ రోడ్డు, భీమారం నుంచి రామారం, హసన్ పర్తి పెద్ద చెరువు, ఎల్లాపూర్ బ్రిడ్జి, ములుగురోడ్డు హనుమాన్ జంక్షన్, ఆరెపల్లి ఉన్నాయి. ఇక వరంగల్ జిల్లాలో పోచమ్మమైదాన్, బూడిదగడ్డ జంక్షన్ నుంచి ఫోర్ట్ రోడ్డు జంక్షన్, ఆర్టీవో ఆఫీస్ జంక్షన్, ఇల్లంద, మైలారం శివారు, నర్సంపేట ఎంజేఆర్ మిల్ క్రాస్, ధర్మారం

గిర్నిబావి సెంటర్ తదితర బ్లాక్​ స్పాట్లను గుర్తించారు. ఆయా చోట్లా రక్షణ చర్యలు చేపట్టేందుకు అప్పట్లో కసరత్తు చేశారు. రివ్యూ మీటింగులు పెట్టి హడావుడి చేశారు. కానీ ఆ తరువాత ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. దీంతోనే కమిషనరేట్​ లో రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట పడటం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇకనైనా ఆర్​ అండ్ బీ, నేషనల్​ హైవే, పోలీస్​, ఆర్టీఏ తదితర డిపార్ట్మెంట్ల అధికారులు ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఓరుగల్లు ప్రజలు కోరుతున్నారు.

ఐదేండ్లలో దాదాపు ఆరువేల ప్రమాదాలు

కమిషనరేట్​ లో ప్రతి సంవత్సరం ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇందులో చాలావరకు సెల్ఫ్​ మిస్టేక్స్​ వల్లే జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. కారణమేదైనా వాహనాల వల్ల జరుగుతున్న ప్రమాదాలు కుటుంబాలకు తీరని శోకాన్ని మిగులుస్తున్నాయి. గత ఐదేండ్లలో కమిషనరేట్​ వ్యాప్తంగా 5,986 ప్రమాదాలు జరగగా.. ఏకంగా 2,140 మంది రోడ్డుకు బలయ్యారు. ఆయా ప్రమాదాల్లో మొత్తంగా 5,784 మంది గాయాలతో ఆసుపత్రులపాలయ్యారు. రహదారులపై కొన్నిచోట్లా ఇంజినీరింగ్​ లోపాలు, కొన్నిచోట్లా ప్రమాదకర మూలమలుపులు కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయనే ఆరోపణలున్నాయి. వీటిని సవరించేందుకు చర్యలు తీసుకోవాల్సిన ఆర్​ అండ్​ బీ, ఎన్​హెచ్​, పోలీస్​, ఇతర అధికారులు లైట్​ తీసుకుంటుండటం వల్లే ప్రమాదాలకు అడ్డుకట్ట పడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

 వరంగల్ కమిషనరేట్​ లో గడిచిన ఐదేండ్లలో జరిగిన ప్రమాదాల వివరాలు 

సం..    ప్రమాదాలు    మరణాలు    గాయాల పాలైనవారు
2019    1,141                  369                  1,213
2020     990                   386                    950
2021    1,180                 460                   1,142
2022    1,149                 438                   1,118
2023    1,526                 482                   1,361