తిలక్ నగర్ చౌరస్తాలో కుంగిన రోడ్డు.. ఆరు నెలల్లో ఇది రెండోసారి

తిలక్ నగర్ చౌరస్తాలో కుంగిన రోడ్డు.. ఆరు నెలల్లో ఇది రెండోసారి
  • ట్రాఫిక్ పోలీసుల అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం

అంబర్ పేట, వెలుగు: సిటీలో రోడ్ల పరిస్థితి నానాటికీ ప్రమాదకరంగా మారుతోంది. తాజాగా మరోచోట రోడ్డు కుంగింది. ఫీవర్ హాస్పిటల్ సమీపంలోని తిలక్ నగర్ చౌరస్తాలో బుధవారం ఉదయం ప్రధాన రహదారి ఒక్కసారిగా కుంగిపోయి పెద్ద రంధ్రం పడింది. వాహనాల రద్దీగా ఎక్కువగా ఉన్న సమయంలో ఈ ఘటన జరగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. 

అయితే అక్కడే విధుల్లో ఉన్న కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు తక్షణమే స్పందించి వాహనాలను నిలిపివేసి, బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. 

ఈ గుంత కింద నుంచి పెద్ద నాలా ప్రవహిస్తుండగా, సరిగ్గా ఆరు నెలల క్రితం కూడా ఇదే చోట రోడ్డు కుంగిపోవడం గమనార్హం. గతంలో చేసిన రిపేర్లు నాణ్యతగా లేకపోవడం వల్లే పదేపదే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా  అధికారులు తాత్కాలిక ప్యాచ్ వర్క్​లతో సరిపెట్టకుండా శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.