కంకర పోశారు.. వదిలేశారు .. ఆరు నెలలవుతున్నా బీటీ వేస్తలే

కంకర పోశారు.. వదిలేశారు .. ఆరు నెలలవుతున్నా బీటీ వేస్తలే
  • రాకపోకలకు ఇబ్బంది పడుతున్న గ్రామస్తులు

నిజాంపేట్, వెలుగు: నిజాంపేట్ మండల కేంద్రం నుంచి నష్కల్ వెళ్లే రోడ్డు అధ్వానంగా తయారైంది. గతేడాది నేషనల్ హైవే 765 డీజీని లింక్ చేసేలా నిజాంపేట్ నుంచి నష్కల్, నంద గోకుల్ మీదుగా చల్మెడ కమాన్ వరకు 18 కిలోమీటర్ల దూరం బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.12 కోట్లు మంజూరయ్యాయి. ఆర్అండ్ బీ అధికారులు టెండర్ ప్రాసెస్ పూర్తి చేసి కాంట్రాక్టర్ తో అగ్రిమెంట్ చేసుకున్నారు. కాంట్రాక్టర్ పని మొదలు పెట్టి నిజాంపేట నుంచి తెంబగుట్ట దాకా మూడు కిలో మీటర్ల దూరం కంకర పోసి వదిలిపెట్టాడు. 

అలాగే నందగోకుల్ ఎక్స్ రోడ్ నుంచి చల్మెడ రూట్​లో రెండు కిలోమీటర్ల దూరం కంకర పోసి వదిలేశారు.  దాదాపు ఆరు నెలలు అవుతున్నా బీటీ వేయడం లేదు. కంకర రోడ్డుపై వెళ్లడానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయా గ్రామాల్లో ఎవరికైనా అనారోగ్య సమస్య ఏర్పడి అర్జంట్ గా హాస్పిటల్ కు వెళ్లాలంటే అవస్థలు పడుతున్నారు. వెంటనే తారువేసి రోడ్డు కంప్లీట్ చేయాలని గ్రామస్తులు డిమాండ్​ చేస్తున్నారు. 

తొందరగా పనులు పూర్తి చేయాలి

నష్కల్ శివారులోని నా పొలం దగ్గరికి బైక్​పై వెళ్లి రావాలంటే గంటల సమయం పడుతుంది. కంకర తేలి బండ్ల మీద పోయే వారు ప్రమాదాలకు గురవుతున్నారు. కంకర మీద నడుపుతుంటే వెహికల్స్ పాడవుతున్నాయి. వెంటనే తారు పోసి రోడ్డు పూర్తి చేయాలి.

  పంపరి నర్సింలు, నిజాంపేట

బైక్​పై రావాలంటే భయమేస్తోంది 

ఆరు నెలల క్రితం కాంట్రాక్టర్ నిజాంపేట నుంచి తెంబగుట్ట వరకు కంకర పోసి వదిలేశాడు. ఆ కంకర మీది నుంచి బైక్ పై రావాలంటే భయమేస్తోంది. ఇప్పటికైనా అధికారులు తొందరగా తారు పోయాలి.

శ్రీనివాస్, నష్కల్

త్వరలో కంప్లీట్ అయ్యేలా చూస్తాం 

నిజాంపేట నుంచి చల్మెడ కమాన్ వరకు కంకర పోసి చాలా రోజులవుతుంది. ఈ రూట్​లో వాహనదారులు వెళ్లాలంటే ఇబ్బందిపడుతున్న మాట వాస్తవమే. వెంటనే కాంట్రాక్టర్​తో మాట్లాడి రోడ్డు పనులు త్వరలో కంప్లీట్​ అయ్యేలా చూస్తాం

విజయ సారథి, ఆర్ అండ్ బీ ఏఈ