తూతూ మంత్రంగా రోడ్ల నిర్మాణం...జనం నుంచి తీవ్ర విమర్శలు

తూతూ మంత్రంగా  రోడ్ల నిర్మాణం...జనం నుంచి తీవ్ర విమర్శలు

పాపన్నపేట, వెలుగు:ఎక్కడైనా డబుల్​రోడ్డు, డివైడర్​నిర్మాణానికి ఫండ్స్​మంజూరైతే మొదట ఒకవైపు రోడ్డు వేసి.. తర్వాత డివైడర్​నిర్మిస్తారు. అనంతరం రెండో వైపు రోడ్డు వేస్తారు. ఒకవేళ ముందుగా డివైడర్​నిర్మించాలనుకుంటే రోడ్డు విస్తరణ పనులు చేపట్టి పునాదులు తీసి డివైడర్​కడతారు. అయితే మెదక్​జిల్లా పాపన్నపేట మండల కేంద్రంలో అందుకు విరుద్ధంగా పనులు చేస్తున్నారు. మెదక్​– బొడ్మట్​పల్లి హైవే నుంచి పాపన్నపేటకు ఉన్న రోడ్డు పూర్తిగా ధ్వంసమై గుంతలు తేలడంతో గతేడాది రూర్బన్​స్కీం కింద రూ.56లక్షలు శాంక్షన్​ కావడంతో 300 మీటర్లు సీసీ రోడ్డు నిర్మించారు. మరో 300 మీటర్లు సీసీ రోడ్డు నిర్మించేందుకు రూ.1.20కోట్లు మంజూరు కాగా ఇంతవరకు టెండర్లు ఖరారు కాలేదు. అయితే ఇదే రోడ్డుపై 600 మీటర్ల మేర డివైడర్, బటర్​ఫ్లై లైట్లు ఏర్పాటు చేసేందుకు రూ.50 లక్షలు మంజూరయ్యాయి. ఆ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్​మొదట నిర్మించిన సీసీ రోడ్డు మధ్యలో డివైడర్ నిర్మించి ఆపకుండా.. మిగిలిన చోట కూడా డివైడర్​కట్టుకుంటూ పోతున్నాడు. కొంత లోతు నుంచి పునాదులు తీయకుండా, మట్టిరోడ్డు పైనే తూతూ మంత్రంగా నిర్మిస్తున్నాడు. ఈ పనులపై జనం నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సీసీ రోడ్డు వేయకుండా డివైడర్ ఎందుకని ప్రశ్నిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, కోఆర్డినేషన్, పర్యవేక్షణ లేకపోవడమే కారణమని మండిపడుతున్నారు. ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా కడుతున్న డివైడర్​ రోడ్డు నిర్మించేలోపే పడిపోయాలా ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మండల కేంద్రంలో ప్రతి 

బుధవారం జరిగే సంతకు వచ్చే వ్యాపారులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై పంచాయతీ రాజ్ ఏఈ గోపాల్ ను వివరణ కోరగా మరో 300 మీటర్లు  సీసీ రోడ్డు నిర్మించాల్సి ఉందని, రూ.1.20 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. టెండర్​ప్రాసెస్​లో ఉందని, ఫైనల్​ కాగానే సీసీ రోడ్డు నిర్మిస్తామని చెప్పారు.