హైదరాబాద్ ఆగమాగం.. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్  

హైదరాబాద్ ఆగమాగం.. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్   
  • చెరువుల్లా మారిన రోడ్లు.. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్  
  • 170 బస్తీలు, 30కి పైగా కాలనీల్లోకి వరద 
  • జనాన్ని బోట్లలో తరలించిన సహాయక సిబ్బంది 
  • మేడ్చల్ మైసమ్మగూడలో నీటమునిగిన హాస్టళ్లు
  • మూసీ పరీవాహక ప్రాంతాల్లో అలర్ట్ 
  • మియాపూర్​లో 14.7 సెంటీమీటర్ల వర్షపాతం
  • ప్రగతినగర్​లో నాలాలో పడి బాలుడు మృతి 
  • పలు జిల్లాల్లో భారీ వర్షం.. పిడుగు పడి ఇద్దరు, చెరువులో గల్లంతై మరొకరు మృతి

హైదరాబాద్, వెలుగు :  భారీ వర్షానికి హైదరాబాద్ అతలాకుతలమైంది. మంగళవారం తెల్లవారుజామున కురిసిన వానకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దాదాపు 170 బస్తీలు, 30కి పైగా కాలనీలు నీట మునిగాయి. చాలాచోట్ల ఇండ్లలోకి వరద చేరింది. షేక్​పేట్​లోని ఓయూ కాలనీ, కుత్బుల్లాపూర్​లోని వోక్షిత్ ఎన్ క్లేవ్, బేగంపేట్​లోని మయూరీమార్గ్, జీడిమెట్లలోని అయోధ్య నగర్ కాలనీల్లో నడుంలోతు వరకు వరద రావడంతో జనం బయటకు రాలేకపోయారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఓయూ కాలనీలో బోట్ల ద్వారా జనాన్ని బయటకు తీసుకొచ్చారు. అయోధ్యనగర్ కాలనీలో ఇండ్లలోకి వరద చేరడంతో స్థానికులు మంచాలపై కూర్చొని బిక్కుబిక్కుమంటూ గడిపారు.

ఇంట్లోని వస్తువులన్నీ తడిసిపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షం కారణంగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలోని స్కూళ్లకు మంగళవారం సెలవు ప్రకటించారు. కాగా, వర్షాల నేపథ్యంలో రెండ్రోజులుగా జీహెచ్ఎంసీ హెల్ప్ లైన్ కు దాదాపు 500 ఫిర్యాదులు రాగా, ఈవీడీఎం కంట్రోల్ రూమ్​కు వందకు పైగా కాల్స్ వచ్చాయి. 

భారీగా ట్రాఫిక్ జామ్ 

కృష్ణానగర్, బోరబండ, మల్కాజిగిరి తదితర ప్రాంతాల్లో వరదలో వాహనాలు కొట్టుకుపోయాయి. రోడ్లపై భారీగా వరద చేరి, చాలా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. 
బేగంపేట్ నుంచి ఫతేనగర్ వెళ్లే అండర్ పాస్ వద్ద వరద నీటిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రి అంబులెన్స్ చిక్కుకుంది. డీఆర్ఎఫ్ సిబ్బంది వచ్చి, అంబులెన్స్​ను బయటకు తీసుకొచ్చారు. అందులో ఉన్న పేషెంట్​​ను వేరే అంబులెన్స్ లో హాస్పిటల్ కి తరలించారు. లింగంపల్లి రైల్వే అండర్ పాస్ వద్ద నడుంలోతు నీళ్లు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. 2 రోజులుగా వర్షాలు కురుస్తుండడం, రోడ్లపై ట్రాఫిక్ జామ్ కారణంగా చాలామంది మెట్రోను ఆశ్రయించారు. దీంతో మెట్రో రైళ్లలో రద్దీ పెరిగింది. 

నిండుకుండలా హుస్సేన్ సాగర్.. 

ఎడతెరిపిలేని వర్షాలతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కు భారీగా వరద వస్తోంది. దీంతో రెండు జలాశయాల్లోనూ 6 గేట్ల చొప్పున ఓపెన్ చేసి, నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం హిమాయత్ సాగర్ కు 4వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా.. 4,120 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ కు 1,600 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా.. 1,380 క్యూసెక్కులు రిలీజ్ చేస్తున్నారు. హిమాయత్ సాగర్ (1,790 అడుగులు),  ఉస్మాన్ సాగర్ (1,763.50 అడుగులు) రెండూ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో మరిన్ని గేట్లు ఓపెన్  చేసే అవకాశం ఉంది.

మూసీకి భారీగా వరద వస్తుండటంతో నదీ పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాగా, హుస్సేన్ సాగర్ కూడా నిండుకుండలా మారింది. పూర్తిస్థాయి నీటిమట్టానికి (513.41 అడుగులు) చేరుకుంది. గ్రేటర్ లోని పలు చెరువులు కూడా నిండుకుండల్లా మారాయి. మియాపూర్ లోని పటేల్ చెరువు తెగిపోవడంతో తాత్కాలిక మరమ్మతులు చేశారు. 

ఈ సీజన్ లోనే అత్యధిక వర్షపాతం.. 

సిటీలో ఈ సీజన్​లోనే అత్యధికంగా మంగళవారం వర్షం కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది. తెల్లవా రుజాము నుంచి ఉదయం 8:30 గంటల వరకు మి యాపూర్​లో 14.7 సెంటీమీటర్లు, హైదర్​నగర్​లో 14.3, శివరాంపల్లిలో 13, గాజులరామారంలో 12.8, బోరబండలో 12.5, జీడిమెట్లలో 12.1, షాపూర్ నగర్, కూకట్​పల్లి, బంజారాహిల్స్ ప్రాంతాల్లో12, షేక్ పేట్ లో 11.9, కుత్బుల్లాపూర్​లో 11.5, మాదాపూర్​లో 11.4 , వెస్ట్​మారేడ్​పల్లిలో 11.2 సెంటిమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైందని వెల్లడించింది.

ఇక ఉదయం 8:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మియాపూర్​లో 5.9, మాదాపూర్​లో 5.2, హైదర్ నగర్ లో 4.7, శివరాంపల్లిలో 4.5 సెంటిమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయిందని చెప్పింది. కాగా, జులై చివర్లో 10 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. 

మేయర్ ముందు బాధితుల గోడు..  

ముంపునకు గురైన కుత్బుల్లాపూర్ లోని అయోధ్యనగర్, గణేశ్ నగర్, బల్కంపేట్ తదితర ప్రాంతాల్లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు తమ గోడు వెల్లబోసుకున్నారు. ఎన్నో ఏండ్లుగా ఇదే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకున్నారు. అంతకుముందు అధికారులతో మేయర్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు అవసరం ఉంటేనే బయటకు రావాలని సూచించారు.

కాగా, బేగంపేట్ సర్కిల్ పికెట్ నాలా, తార్నాక డివిజన్ లోని సత్యనగర్, లాలాపేట్ తదితర ప్రాంతాల్లో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి పర్యటించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ కూడా పలు ప్రాంతాల్లో పర్యటించారు. అవసరమైతే మూసీ పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. నగరవాసులు ఇబ్బందులుంటే జీహెచ్ఎంసీ హెల్ప్ లైన్ నంబర్ 04- 2111 1111, ఈవీడీఎం కంట్రోల్ రూమ్ నంబర్ 90001 13667కు ఫోన్ చేయాలని సూచించారు. 

హాస్టళ్ల ఫస్ట్ ఫ్లోర్ దాకా వరద

మేడ్చల్, వెలుగు : భారీ వర్షానికి మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలోని మైసమ్మగూడ ఏరియా నీట మునిగింది. ఇక్కడున్న మల్లారెడ్డి యూనివర్సిటీలోకి భారీగా వరద చేరింది. వర్సిటీ హాస్టళ్లు సహా మరికొన్ని ప్రైవేట్ హాస్టళ్లలో ఫస్ట్ ఫ్లోర్ దాకా నీళ్లు వచ్చాయి. దాదాపు 15 నుంచి 20 హాస్టల్స్ బిల్డింగ్ ల్లో చిక్కుకున్న స్టూడెంట్లను మున్సిపల్, పోలీస్ సిబ్బంది జేసీబీల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

మల్లారెడ్డి విద్యాసంస్థలకు నాలుగు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. దీంతో స్టూడెంట్స్ కట్టుబట్టలతో సొంతూళ్లకు వెళ్లిపోయారు. కాగా, కల్వర్టులనూ కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారని.. దీంతో నీళ్లు వెళ్లే మార్గం లేక లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. అక్రమ నిర్మాణాలకు అధికారులే అనుమతులు ఇస్తున్నారని ఆరోపించారు.

అప్రమత్తంగా ఉండండి : కలెక్టర్లకు సీఎస్ ఆదేశం

హైదరాబాద్​, వెలుగు :  రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను సీఎస్​ శాంతికుమారి ఆదేశించారు. ఏవిధమైన ప్రాణ, ఆస్తి నష్టం కలుగకుండా అన్ని శాఖల సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్లతో సీఎస్​ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటికే వివిధ జిల్లాల్లోని చెరువులు, కుంటలు నిండుగా ఉన్నాయని, ఆయా చెరువులకు గండ్లు పడడం, తెగిపోకుండా రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఉధృతంగా ప్రవహించే కాజ్-వేలు, కల్వర్టులు, వంతెనల వద్ద  ముందు జాగ్రత్త చర్యగా తగు భద్రతా ఏర్పాట్లను చేపట్టాలని సూచించారు.

భారీ వర్షాలు, వరదలతో జరిగే నష్టాన్ని నివారించేందుకుగాను సంబంధిత  మండల రెవెన్యూ,  పీఆర్ తదితర అధికారులతో రెగ్యులర్ టెలికాన్ఫరెన్స్​ల ద్వారా సమీక్షించాలని పేర్కొన్నారు. ప్రతి జిల్లా కలెక్టరేట్​లో కంట్రోల్ రూమ్​లను ఏర్పాటు చేసి పరిస్థితులను సమీక్షించాలన్నారు. వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలకు అగ్నిమాపక,  పోలీసు బృందాలను మోహరించాలని కోరారు. వర్ష, వరద ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాతాలకు తరలించాలని,  వరద బాధిత కుటుంబాలకు సహాయక శిబిరాలను ఏర్పాటు చేయాలని సీఎస్​ ఆదేశించారు.