మెదక్​ జిల్లాలో  రోడ్లు పూర్తిగా డ్యామేజ్

మెదక్​ జిల్లాలో  రోడ్లు పూర్తిగా డ్యామేజ్

మెదక్ (నిజాంపేట, శివ్వంపేట), వెలుగు:  మెదక్​ జిల్లాలో  రోడ్లు పూర్తిగా డ్యామేజ్​అయ్యాయి. అడుగడుగునా గుంతలతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలు జరుగుతున్నాయని, వెహికల్స్​త్వరగా పాడవుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. గత నవంబర్ లో సీఎం కేసీఆర్ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి ‘ దెబ్బతిన్న రోడ్లన్ని యుద్ధప్రాతిపదికన బాగు చేయాలి. అద్దంలా మెరవాలి’ అని ఆఫీసర్లకు చేసిన సూచనలు ఆ పూటకే పరిమితమయ్యాయి. 

జిల్లాలో ఇదీ పరిస్థితి... 

చేగుంట పట్టణం నుంచి సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణం వరకు ఉన్న 28 కిలోమీటర్ల రోడ్డు పూర్తిగా గుంతలమయమైంది. ఐదేండ్ల కిందటే ఈ రోడ్డును రూ.35 కోట్లతో నిర్మించారు. రోజుకు నాలుగు వేల వెహికల్స్​ వరకు రాకపోకలు కొనసాగిస్తాయి.  కంపెనీలకు ముడిసరుకును తీసుకువచ్చే, అక్కడ ఉత్పత్తి అయ్యే ప్రొడక్ట్స్​ ట్రాన్స్​పోర్ట్ చేసే కంటెయినర్లు ఇక్కడ ఎక్కువగా తిరుగుతాయి. ఈ క్రమంలో రోడ్డంతా పాడైంది. దీంతో అరగంట వెళ్లాల్సిన చోటుకు గంట సమయం పడుతోందని వాహనదారులు వాపోతున్నారు.  కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలో నుంచి మెదక్ –జోగిపేట మెయిన్ రోడ్డు వరకు మూడు కిలోమీటర్ల రోడ్డు పూర్తిగా డ్యామేజ్​ అయ్యింది. ఏండ్ల కొద్దీ పరిస్థితి ఇలాగే ఉన్నా పట్టించుకున్నవారులేరు. దీంతో రంగంపేట, సంగాయిపేట, ఎనగండ్ల, మాందాపూర్, కోనాపూర్, పైతర, తుక్కాపూర్ గ్రామాలకు చెందిన వారు మండల కేంద్రమైన కొల్చారం వెళ్లడానికి  ఏడెనిమిది కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సి వస్తోంది. కొల్చారం నుంచి అంసాన్​ పల్లి తండా వరకు ఉన్న నాలుగు కిలోమీటర్ల రోడ్డు కూడా పూర్తిగా దెబ్బతిన్నది. దీంతో కొంగోడ్, నాయిని జలాల్ పూర్, పోతరెడ్డిపల్లి, అంసాన్​పల్లి గ్రామాలు, తండాల ప్రజలకు తంటాలు తప్పడం లేదు. 

మెదక్ మండలం మంబోజిపల్లి నుంచి చిట్యాల, జానకంపల్లి మీదుగా కొల్చారం మండలం కొంగోడ్ వరకు ఉన్న రోడ్డంతా గుంతలే కనిపిస్తున్నాయి. ఈ కారణంగా ఇక్కడ ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. కౌడిపల్లి మండలం వెల్మకన్నే నుంచి కొల్చారం మండలం పోతరెడ్డిపల్లి వరకు ఉన్నరోడ్డుపై అడుగుకో గుంత ఏర్పడింది. అంతటా కంకర తేలి బైక్​ కూడా వెళ్లలేని పరిస్థితి ఉంది. నిజాంపేట మండల కేంద్రం నుంచి నస్కల్, నగరం, నందగోకుల్, రాంపూర్ గ్రామాలకు వెళ్లే రోడ్డుపై అధ్వానంగా తయారైంది. నిజాంపేట నుంచి రాంపూర్ వరకు ఉన్న ఏడు కిలోమీటర్ల రోడ్డు పూర్తిగా డ్యామేజ్​ అయ్యింది.  నందగోకుల్, నగరం, నస్కల్, రాంపూర్ గ్రామాల వారు చీకట్లో ఈ రూట్ లో వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ రోడ్డు అభివృద్ధికి ఫండ్స్​మంజూరయ్యాయని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఎప్పటినుంచో చెబుతున్నా పనులు మాత్రం జరగడంలేదు. శివ్వంపేట మండలం అనంతారం చౌరస్తా నుంచి చంది వరకు 10 కిలో మీటర్లు, మరో వైపు ఏదులాపూర్ చౌరస్తా నుంచి పోతులగూడ వరకు 8 కిలోమీటర్లు పూర్తిగా దెబ్బతింది. ఈ రెండు రూట్లలో ఉన్న ఎనిమిది గ్రామాల ప్రజల రాకపోకలకు ఇబ్బంది అవుతోంది. గతంలో ఈ రూట్​లో వెల్దుర్తి నుంచి బాలానగర్ వరకు ఆర్టీసీ బస్సు నడిచేది. అయితే ఇప్పుడు రోడ్డు పూర్తిగా డ్యామేజ్​ కావడంతో బస్సు రద్దయింది. దీంతో ఆయా గ్రామాల నుంచి రోజూ కూరగాయలు, పాలు నర్సాపూర్, తూప్రాన్, హైదరాబాద్ తీసుకెళ్లే రైతులకు అసౌకర్యంగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి రిపేర్లు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

ఆఫీసర్లు ఏమన్నారంటే..

నవాపేట రోడ్డు దుస్థితిపై శివ్వంపేట మండల పీఆర్​ ఏఈ భాస్కర్ ను వివరణ కోరగా ఎనిమిదిసార్లు టెండర్ వేసినా కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. అందువల్ల పని చేపట్టలేకపోతున్నట్టు చెప్పారు. నిజాంపేట మండలంలోని నస్కల్, రాంపూర్ రోడ్డు గురించి ఆర్ అండ్​ బీ ఏఈ విజయ సారథిని వివరణ కోరగా రూ.11 కోట్లు మంజూరు అయ్యాన్నారు.  టెండర్ ప్రక్రియ పూర్తయ్యిందని, మరో 20 రోజుల్లో పనులు మొదలవుతాయన్నారు.