వనపర్తి జిల్లాలో భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు..

వనపర్తి జిల్లాలో భారీ వర్షాలతో  దెబ్బతిన్న రోడ్లు..
  • సర్కారుకు రూ.28 కోట్లతో ప్రతిపాదనలు పంపిన ఆఫీసర్లు
  • రూ.1.27 కోట్లతో టెంపరరీ వర్క్స్  చేసేందుకు టెండర్లు

వనపర్తి, వెలుగు: ఎడతెరిపిలేని భారీ వర్షాలతో వనపర్తి జిల్లాలోని పలు మండలాల్లో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇలా 19 రోడ్లు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. దెబ్బతిన్న రోడ్లపై వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గుంతలు తేలిన రోడ్లపై రాత్రి వేళల్లో ప్రయాణం మరీ ఇబ్బందికరంగా ఉంటోంది. దెబ్బతిన్న రోడ్లను ఆర్అండ్​బీ అధికారులు పరిశీలించి రిపేర్లకు రూ.28 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. 

ప్రస్తుతానికి ఆర్అండ్​బీ​శాఖ వద్ద ఉన్న మెయింటెనెన్స్​ నిధులతో తాత్కాలికంగా మరమ్మతులు చేయనున్నారు. రూ.1.27 కోట్లతో టెంపరరీ వర్క్స్​ చేయాలని నిర్ణయించారు. ఇదిలాఉంటే పర్మినెంట్​ రిపేర్లు చేయాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు అయ్యేంత వరకు ఆగాల్సిందేనని అంటున్నారు. అప్పటి వరకు వర్షాలతో దెబ్బతిన్న రోడ్లకు రిపేర్లు చేయించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. 

దెబ్బతిన్న రోడ్లు ఇవే..

 మదనాపురం మండల కేంద్రం నుంచి రామన్ పాడు, అజ్జకొల్లు, రామన్​పాడు ప్రాజెక్టుకు వెళ్లే రహదారి పూర్తిగా గుంతలమయంగా మారింది. ఈ గుంతల్లో వర్షం నీళ్లు నిలిచి రాకపోకలకు తిప్పలు పడుతున్నారు. మదనాపురం రైల్వే గేట్  సమీపంలో లో లెవెల్  వంతెన వద్ద కొంత భాగం రోడ్డు దెబ్బతినగా, బ్రిడ్జిపై 10 ఫీట్లకు పైగా సిమెంట్  రోడ్డు ధ్వంసమైంది.

  వనపర్తికి 10 కిలోమీటర్ల దూరంలో ఉండే పెద్దమందడి మండల కేంద్రానికి బస్సులు తక్కువగా నడుస్తాయి. ఎక్కువగా ఆటోలు, బైక్స్​ను ఆశ్రయిస్తారు. ఈ మార్గంలో రోడ్డు ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిని గుంతలమయంగా మారింది.  గుంతల్లో నీళ్లు నిలిచి ఈ దారిలో ప్రయాణించాలంటేనే భయపడాల్సి వస్తోంది.

 ఖిల్లాగణపురం మండలకేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారిపై బ్రిడ్జి నిర్మించినప్పటికీ, బీటీ రోడ్డు వేయకపోవడంతో అడుగుకో గుంతతో అధ్వాన్నంగా మారింది. వనపర్తి నుంచి ఖిలాగణపురం మీదుగా మహబూబ్​నగర్​ వెళ్లేందుకు ఈ దారే ప్రధానం కావడంతో బస్సులు, ఆటోలు, బైక్​లు ఎక్కువగా తిరుగుతుంటాయి. రెండు రోజుల కింద ఇదే దారిలో వేగంగా వస్తున్న కారు గుంతల కారణంగా అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఒకరు చనిపోయారు.

 రేవల్లి మండల కేంద్రం నుంచి నాగాపూర్​ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిలో భారీ వర్షాలతో ధ్వంసమైంది. దీంతో వాహనదారులు తిప్పలు పడుతున్నారు.

పెబ్బేరు మండలం చెలిమిల్ల–షేరుపల్లి గ్రామాల మధ్య తుంటిమాను వాగు పొంగినప్పుడల్లా రెండు గ్రామాల మధ్య రాకపోకలు బంద్​ అవుతున్నాయి. నీరు తగ్గినా రోడ్డు మధ్యలో ఏర్పడిన గుంతలతో ప్రయాణించడం  నరకప్రాయంగా మారింది. రంగాపూర్–-రాంపురం గ్రామాల మధ్య రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో తిప్పలు పడుతున్నారు. 

రూ.28 కోట్లతో ప్రపోజల్స్​ పంపించాం..

జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు పర్మినెంట్​ రిపేర్లు చేయించేందుకు ప్రభుత్వానికి రూ.28 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. మా శాఖలో అందుబాటులో ఉన్న రూ.1.27 కోట్ల మెయింటెనెన్స్​ నిధులతో దెబ్బతిన్న రోడ్లకు ప్యాచ్​ వర్క్స్​​చేస్తాం. ఇప్పటికే పనులకు సంబంధించిన టెండర్లు పిలిచాం.