వివేక్ వెంకటస్వామి కృషితోనే ఆర్వోబీ మంజూరు

వివేక్ వెంకటస్వామి కృషితోనే ఆర్వోబీ మంజూరు
  •     తామే మంజూరు చేయించామంటూ కొందరు తప్పుదోవ పట్టిస్తున్నరు
  •     బీజేపీ నియోజకవర్గ ఇన్ చార్జి అందుగుల శ్రీనివాస్

రామకృష్ణాపూర్, వెలుగు: రామకృష్ణాపూర్ ‌‌‌‌–‌‌- మంచిర్యాల మార్గంలోని క్యాతన్ పల్లి రైల్వే గేటు వద్ద రైల్వే ఆర్వోబీ వంతెన మంజూరుకు అప్పటి ఎంపీ, బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు వివేక్  వెంకటస్వామి కృషే కారణమని బీజేపీ నియోజకవర్గ ఇన్ చార్జి అందుగుల శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం క్యాతన్ పల్లి రైల్వే గేటు వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  ఆయన మాట్లాడారు. రామకృష్ణాపూర్, మందమర్రి మండల పరిధిలోని 30 గ్రామాల ప్రజలు క్యాతన్ పల్లి రైల్వే గేటు వద్ద ఆర్వోబీ లేకపోవడంతో నిత్యం ఇబ్బందులు పడేవారని చెప్పారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన అప్పటి పెద్దపల్లి ఎంపీ వివేక్  వెంకటస్వామి  రైల్వే శాఖ మంత్రిని పలుమార్లు కలిసి ఆర్వోబీ మంజూరు చేయాలని విన్నవించినట్లు చెప్పారు. ఆయన కృషి ఫలితంగా స్పందించిన  కేంద్ర ప్రభుత్వం 2014  సెప్టెంబర్ లో క్యాతనపల్లి రైల్వే గేటు వద్ద ఆర్వోబీ నిర్మాణం కోసం రూ.32 కోట్లు మంజూరు చేసిందన్నారు.  రైల్వే శాఖ గేటు వద్ద ఆర్వోబీ పనులను చేపట్టి ఏడాదిలోపు పూర్తి చేసిందని గుర్తుచేశారు. ఆర్వోబీకి ఇరువైపుల అప్రోచ్ రోడ్డు పనులు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సి ఉండటంతో అప్పటి ఎమ్మెల్యే నిధుల కోసం ప్రయత్నాలు చేశారన్నారు.

2018 ఫిబ్రవరిలో రూ.27.50 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం అప్రోచ్ రోడ్డు కోసం మంజూరు చేసిందని తెలిపారు. కాంట్రాక్టర్ పనులు వేగవంతం చేసే సమయంలో బ్రిడ్జి నిర్మాణంలో భూమిని కోల్పోతున్న నిర్వాసితులు అదనపు నష్టపరిహారం కోసం కోర్టుకు వెళ్లడంతో పనులు నిలిచిపోయాయని తెలిపారు. నిర్వాసితులకు నష్టపరిహారం అందడంతో అప్రోచ్ రోడ్డు పనులు నడుస్తున్నాయన్నారు. క్యాతన్ పల్లి రైల్వే గేటు వద్ద ఆర్వోబీ ఏర్పాటుకు మాజీ ఎంపీ వివేక్  వెంకటస్వామి కృషి చేసి నిధులు మంజూరు చేయిస్తే కొందరు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే వల్లే ఆర్వోబీ వచ్చిందని తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. సొమ్ము ఒకరిది.. సోకు ఒకరిది అన్న తీరులో ప్రస్తుత ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆర్వోబీకి మాజీ ఎంపీ వివేక్  వెంకటస్వామి నిధులు మంజూరు చేయిస్తే తాను చేశానని ప్రస్తుత ఎమ్మెల్యే బాల్క సుమన్  శిలాఫలకం ఆవిష్కరించడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని పేర్కొన్నారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో అప్పటి ఎంపీ వివేక్  వెంకటస్వామి హయాంలోనే కొత్త రైళ్ల మంజూరు, రైళ్ల హాల్టింగ్ లు, స్టేషన్ల అభివృద్ధి జరిగిందన్నారు. రామకృష్ణాపూర్, మందమర్రి ప్రజల డిమాండ్  మేరకు  మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి  రైల్వే శాఖ మంత్రిపై ఒత్తిడి తీసుకువచ్చి రవీంద్రఖని రైల్వేస్టేషన్ లో కాగజ్ నగర్  ఎక్స్ ప్రెస్ , ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ , మందమర్రిలో ఇంటర్  సిటీ ఎక్స్ ప్రెస్  హాల్టింగ్ కు చేసిన కృషి ప్రజలు మరిచిపోరని గుర్తుచేశారు.  సమావేశంలో బీజేపీ టౌన్  ప్రెసిడెంట్  మహంకాళీ శ్రీనివాస్   తదితరులు పాల్గొన్నారు.