పూజలు చేస్తే.. డబ్బు మూడింతలైతదని.. యువకుడిని బురిడీ కొట్టించి రూ.55.55 లక్షలతో పరార్

పూజలు చేస్తే.. డబ్బు మూడింతలైతదని.. యువకుడిని బురిడీ కొట్టించి రూ.55.55 లక్షలతో పరార్

హనుమకొండ, వెలుగు: బ్యాగులో పెట్టిన డబ్బులకు పూజలు చేస్తే మూడింతలు అవుతాయని నమ్మించి ఓ వ్యక్తి నుంచి దొంగబాబాలు రూ.55.55 లక్షలు కొట్టేశారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ధర్మసాగర్ పీఎస్ పరిధి ఉనికిచెర్ల శివారులో గత నెలాఖరులో జరగగా.. ఆలస్యంగా శనివారం వెలుగులోకి వచ్చింది. 

గ్రామానికి చెందిన ఓ యువకుడికి నిరూప్ నగర్ తండాకు చెందిన వ్యక్తి హైదరాబాద్ కు చెందిన ప్రదీప్, మంగేశ్ అనే ఇద్దరు పూజారులను పరిచయం చేశాడు. తాము డబ్బులు ఎక్కువగా సంపాదించేలా పూజలు చేస్తామని సదరు యువకుడిని నమ్మించారు. రూ.55,55,555 రెడీ చేసుకోవాలని, పూజలు చేసి ఆ మొత్తాన్ని మూడింతలు చేస్తామని చెప్పారు. వారి మాటలు నమ్మిన సదరు యువకుడు తనకున్న ఒక ప్లాట్ అమ్మడంతో పాటు బ్యాంక్ లోన్ తీసుకుని వారు చెప్పిన మొత్తాన్ని రెడీ చేశాడు.

డిసెంబర్ 30న పూజలు చేసేందుకు ప్రదీప్, మంగేశ్ ఇద్దరూ వరంగల్ కు రాగా.. వారిని ఉనికిచెర్ల సమీపంలోని తమ గెస్ట్ హౌజ్ కు తీసుకెళ్లాడు. దీంతో ప్రదీప్, మంగేశ్ ఇద్దరూ రూ.55.55 లక్షలున్న బ్యాగుకు పూజలు చేస్తే అవి రూ.2 కోట్లు అవుతాయని నమ్మించారు. అనంతరం పూజలు చేస్తున్నట్లు నటించి యువకుడితో పాటు అతని కుటుంబ సభ్యులను గెస్ట్ హౌజ్ లోని రూమ్ లోకి పంపించి, పైసల బ్యాగుతో ఉడాయించారు. బాధితులు ధర్మసాగర్ పోలీసులను ఆశ్రయించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.