హై సెక్యూరిటీ గేటెడ్ కమ్యూనిటీలో దోపిడీ

హై సెక్యూరిటీ గేటెడ్ కమ్యూనిటీలో దోపిడీ
  • వృద్ధురాలి కంట్లో కారం కొట్టి.. గోల్డ్ చైన్ల రాబరీ
  • వనస్థలిపురంలోని సహారా ఎస్టేట్​లో ఘటన

ఎల్బీనగర్, వెలుగు: చుట్టూ ఫెన్సింగ్, సీసీ కెమెరాలు, భద్రతా సిబ్బందితో నిత్యం నిఘా నీడలో ఉండే.. హై సెక్యూరిటీ గేటెడ్ కమ్యూనిటీలో దోపిడీ జరిగింది. వృద్ధురాలి కంట్లో కారం కొట్టి, చెయ్యి కొరికి.. ఆమె మెడలోని గోల్డ్​చైన్​లను దుండగులు ఎత్తుకెళ్లారు. రిటైర్డ్ డాక్టర్ నిరంజన్ (77), రామసుందరి (63) దంపతులు. వీరికి ఒక కొడుకు ఉండగా, లండన్​లో సెటిలయ్యాడు. 

వృద్ధ దంపతులిద్దరూ రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలోని సహారా ఎస్టేట్ గేటెడ్​కమ్యూనిటీలో విల్లా తీసుకొని అక్కడే నివాసం ఉంటున్నారు. శుక్రవారం ఉదయం భర్త నిరంజన్ వాకింగ్​కు వెళ్లగా, రామసుందరి ఇంట్లో ఒంటరిగా ఉంది. ఈ సమయంలో గుర్తుతెలియని మహిళ మాస్క్​ధరించి ఇంట్లోకి ప్రవేశించింది. ఆమె కంట్లో కారం కొట్టి, మెడలోని 6 తులాల రెండు గోల్డ్​చైన్​లు (ఒక్కొక్కటి 3​ తులాలు) తీసే ప్రయత్నం చేసింది. 

వృద్ధురాలు ప్రతిఘటించగా, ఆమె చేతిని కొరికి పరారైంది. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితురాలి కోసం గాలిస్తున్నారు. హై-సెక్యూరిటీ గేటెడ్ కమ్యూనిటీలో ఈ దోపిడీ జరగడం.. భద్రతా వైఫల్యంపై అనుమానాలను రేకెత్తిస్తోంది. దుండగుడు మహిళ వేషంలో కూడా వచ్చి ఉండవచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది.