హైదరాబాద్ వ్యాపారి ఇంట్లో రూ.5 కోట్ల దోపిడీ

హైదరాబాద్ వ్యాపారి ఇంట్లో రూ.5 కోట్ల దోపిడీ

నమ్మకస్తులే నట్టేట ముంచుతున్న ఘటనలు సమాజంలో నిత్యం చూస్తున్నాం. దొంగ చేతికి ఇంటి తాళాలు ఇచ్చినట్లు యజమానులు సైతం కొందరికి ఇళ్లు అప్పజెప్పి పోతే తిరిగి వచ్చే సరికి లూఠీ చేస్తున్నారు. ఓ వ్యాపారి ఇంట్లో తెలిసిన వారే దోపిడీ చేసిన ఘటన హైదరాబాద్​లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  సికింద్రాబాద్‌లోని రాంగోపాల్‌పేటలో నివాసముంటున్న రాహుల్‌ గోయల్‌..   నేపాల్‌కు చెందిన కమల్‌ అనే వ్యక్తిని వాచ్‌మెన్‌గా నియమించుకున్నాడు. కమల్ తన కుటుంబంతో కలిసి రాహుల్ బంగ్లాలోని సర్వెంట్ క్వార్టర్స్‌లో బస చేశారు.  

జులై 9న రాహుల్, అతని కుటుంబ సభ్యులు నగర శివార్లలో ఉన్న ఒక ఫామ్‌హౌస్‌లో ఫంక్షన్​కి వెళ్లి జులై 11న  తిరిగి వచ్చారు.  వాచ్‌మెన్, అతని కుటుంబ సభ్యులు  ఇంట్లో లేరని గుర్తించారు. రాహుల్ ఇంటి లోపలికి వెళ్లి చూడగా బెడ్‌రూమ్‌లోని బీరువాలు తెరిచి ఉన్నాయి. రూ. 49 లక్షల నగదు, 4 కిలోల బంగారం, 10 కిలోల వెండి మాయమయ్యాయి.  వాచ్​మెన్​కుటుంబమే చోరీకి పాల్పడినట్లు గుర్తించి ఆయన పోలీసులకు సమాచారం అందించారు.  

వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.  ముంబయిలో వారి కుటుంబలోని పలువురిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. మిగతావారి కోసం గాలిస్తున్నామన్నారు.