రాజకీయాల్లోకి సోనియా గాంధీ అల్లుడు .. అమేథీ నుంచి పోటీ?

రాజకీయాల్లోకి  సోనియా గాంధీ అల్లుడు .. అమేథీ నుంచి పోటీ?

కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి.  ఆయన అమేథీ పార్లమెంట్ నియోజకవర్గం నుండి రాజకీయ అరంగేట్రం చేస్తారని సమాచారం.  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి వయనాడ్‌లో పోటీ చేస్తుండటంతో కాంగ్రెస్‌ ప్రతిష్ఠాత్మకంగా భావించే అమేథీ సీటుపై సందిగ్ధత నెలకొంది. 

ఈ క్రమంలో రాబర్ట్ వాద్రా అక్కడి నుంచి బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు ఆయన చేసిన  చేసిన కామెంట్స్ అందుకు బీజం పోస్తున్నాయి.  తాను పోటీ చేయాలనుకుంటే అమేథీ నుంచే బరిలోకి దిగుతానని.. గాంధీ ఫ్యామిలీని అమేథీ కోరుకుంటోందన్నారు రాబర్ట్ వాద్రా . సిట్టింగ్ ఎంపీ స్మృతి ఇరానీ పట్ల అమేథీ ప్రజలు విసిగిపోయారని..  గాంధీ కుటుంబంలోని ఒకరు తిరిగి ఇక్కడ పోటీ చేయాలని  కోరుకుంటున్నారని వాద్రా అన్నారు.  అమేథీ, రాయ్‌బరేలీ, సుల్తాన్‌పూర్, జగదీష్‌పూర్ ప్రజల కోసం గాంధీ కుటుంబం ఏళ్ల తరబడి కష్టపడిందని వాద్రా అన్నారు. 

2022 జూలైలో ప్రజలు కోరుకుంటే తాను క్రియాశీల రాజకీయాల్లో చేరాలని ఆలోచిస్తానని వాద్రా చెప్పారు. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఆయన అత్త సోనియా గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బలమైన స్థానాలైన రాయ్‌బరేలీ, అమేథీల్లో అభ్యర్థులను ఇంకా వెల్లడించలేదు. ప్రియాంక గాంధీ వాద్రా రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయవచ్చని ప్రచారం జరుగుతుంది.  2019 లోక్‌సభ ఎన్నికలలో  బీజేపీకి చెందిన స్మృతి ఇరానీ రాహుల్ గాంధీని ఓడించారు.