టీచింగ్ రోబో..త్వరలో అందుబాటులోకి..

 టీచింగ్ రోబో..త్వరలో అందుబాటులోకి..

చిట్టి ..ద రొబాట్..గుర్తుందా..శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన రోబో సినిమాలో రోబో చేసే విన్యాసాలు చూసి అబ్బురపడ్డాం.  ఆ తర్వాత కొన్ని కొన్ని రెస్టారెంట్లలో రోబోలు వడ్డిస్తుంటే ఇష్టంగా తింటూ సంబరపడ్డాం.  మరి  రోబోలు పాఠాలు చెబితే ఆశ్చపోవాల్సిందే.  అవును..త్వరలో రోబోలు టీచర్లుగా మారబోతున్నాయి..గవర్నమెంట్ స్కూళ్లలో విద్యార్థులకు పాఠాలు బోధించబోతున్నాయి. 

హైదరాబాద్కు చెందిన  ఇండస్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ మొదటి టీచింగ్‌ రోబోలను  తయారు చేసింది. వీటికి ఈగిల్ అనే పేరు కూడా పెట్టింది. ఇప్పటికే శంకర్‌ పల్లి మండల పరిధిలో గల మోకిల వద్ద ఇండస్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో  ఈగిల్ రోబోలు పాఠాలు కూడా చెబుతున్నాయి. ఉపాధ్యాయుల వలే పిల్లలకు అర్ధమయ్యే విధంగా బోధిస్తున్నాయి. 

త్వరలో మన దగ్గర కూడా..
తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ రోబోలతో పాఠాలు చెప్పించే ఆలోచనలో ఉంది. ఇప్పటికే ఈగిల్ రోబోల పనితీరును మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు.  రోబో టీచర్‌ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన  మంత్రి సబిత..గవర్నమెంట్ స్కూళ్లలో రోబోలను టీచర్లుగా నియమించేందుకు గల అవకాశాలను పరిశీలిస్తామని తెలిపారు. 

కర్నాటకలో రోబో పాఠాలు..
హైదరాబాద్ లోని ఇండస్ ఇంటర్నేషనల్ స్కూళ్లోనే కాదు..బెంగూళురు, పూణేలోని ఇండస్ స్కూళ్లలో 21 ఈగిల్స్ రోబోలు పాఠాలు బోధిస్తున్నాయి. అటు ఇండస్ స్కూల్తో ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు  30 రోబోలను కన్నడ ప్రభుత్వానికి ఇండస్ స్కూల్ అప్పగించింది. పలు స్కూళ్లలో ఈ రోబోలు పాఠాలు కూడా చెబుతున్నాయి. 

రోబోల స్పెషలేంటంటే..?
ఈగిల్ రోబోలు..30 భాషల్లో పాఠాలు చెప్పగలవు. అన్ని లాంగ్వేజ్ లతో పాటు..సైన్స్, హ్యుమానిటీస్ వంటి సబ్జెక్టులను బోధించగలవు.  5వ తరగతి నుంచి 11వ తరగతి పాఠాలు సునాయాసంగా బోధిస్తాయి. అంతేకాదు స్టూడెంట్స్ డౌట్స్ ను కూడా తీరుస్తాయి. మొబైల్, ట్యాబ్‌, ల్యాప్‌ టాప్‌లతో ఈ రోబో కంటెంట్‌తో విద్యార్థులు కనెక్ట్ కావచ్చు.  ఈ రోబో ప్యాకేజీ ప్రీలోడెడ్‌ కంటెంట్‌ను కలిగి ఉంటుంది. దీని వల్ల వివిధ భాషల్లో విభిన్న పాఠ్యాంశాల కోసం రూపొందించుకుని వీలుంది.  పిల్లలకే కాదు..టీచర్లకు ఈ రోబో ట్రైనింగ్ ఇస్తుంది. విద్యార్థులకు ఏవిధంగా పాఠాలు చెబితే అర్థమవుతుందో వారికి రోబోలు వివరిస్తాయి.  

మనుషులతో పోలిస్తే రోబోలు స్పష్ఠంగా పాఠాలు..పిల్లలకు అర్థమయ్యే రీతిలో దృశ్య రూపంలో పాఠాలు చెబుతాయి. ఈ రోబోలు అందుబాటులోకి వస్తే విద్యార్థులకు నాలెడ్జ్ పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అటు రోబోల వల్ల స్కూళ్లలో టీచర్ల కొరత కూడా తీరుతుందంటున్నారు. విద్యలో నాణ్యతను మెరుగుపరచొచ్చని చెబుతున్నారు.