హైదరాబాద్ సిటీ, వెలుగు: రానున్న వినాయక చవితి, గణేశ్ నిమజ్జన వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి ఆదేశించారు. తార్నాకలోని హెడ్ ఆఫీసులో శనివారం జోనల్ కమిషనర్లు, వివిధ శాఖల హెచ్ వోడీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సరూర్‌నగర్, సఫిల్‌గూడ, కాప్రా తదితర ప్రధాన సరస్సులు, బేబీ పాండ్ల వద్ద స్టాటిక్, మొబైల్ క్రేన్లను సిద్ధం చేయాలన్నారు.
ఊరేగింపు మార్గాల్లో దెబ్బతిన్న రోడ్లకు ప్యాచ్‌వర్క్ ను సెప్టెంబర్ 13లోగా పూర్తి చేయాలని, మార్గమధ్యలో ఉన్న కేబుల్ వైర్లు, అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని సూచించారు. పరిశుభ్రత కోసం 3, 4 కిలోమీటర్లకో గణేశ్యాక్షన్ టీమ్ ఏర్పాటు చేసి, 24 గంటలూ పారిశుధ్య పనులు నిర్వహించనున్నట్లు తెలిపారు. నిమజ్జన ప్రాంతాల వద్ద తాగునీరు, లైట్లు, మొబైల్ టాయిలెట్లు, కంట్రోల్ రూమ్‌లతో పాటు బోట్లు, ఈతగాళ్లు, అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాలని చెప్పారు.
