
- జీడీపీ గ్రోత్@16%
- మొత్తం ఏడాదికి మాత్రం 7 శాతమే
- మొదటి క్వార్టర్‌పై డీబీఎస్అంచనా
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో జీడీపీ గ్రోత్ 16 శాతం వరకు ఉండొచ్చని డీబీఎస్ గ్రూప్ రీసెర్చ్ అంచనా వేసింది. మొత్తం ఆర్థిక సంవత్సరం గ్రోత్ మాత్రం 7 శాతం వరకే ఉండొచ్చని తెలిపింది. ఇది విడుదల చేసిన రిపోర్టు ప్రకారం... ఈ సంవత్సరం ఆసియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎకానమీగా భారతదేశం అవతరించింది. మన జీడీపీ 2022–-23 ఆర్థిక సంవత్సరం (ఏడాది లెక్కన) మొదటి క్వార్టర్లో 4.1 శాతం నుండి 16 శాతానికి పెరిగే అవకాశం ఉంది. అధికారిక జీడీపీ లెక్కలు ఆగస్టు 31న విడుదల అయ్యే అవకాశం ఉంది. భారతదేశ గ్రాస్ వాల్యూ యాడెడ్ (జీవీఏ) 14.5 శాతం వరకు ఉండొచ్చు. అయితే, ఎకానమీకి పుంజుకునేందుకు బలమైన అవకాశాలు ఉన్నాయి కాబట్టి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) వడ్డీ రేట్లను మరింతంగా పెంచే అవకాశం ఉంది. దీని లెక్కలను గమనిస్తే రేట్లు ఇంకా న్యూట్రల్ లెవెల్లో లేవని అర్థమవుతున్నది. బహుశా ఒకటి-రెండు పెంపులకు అవకాశాలు ఉన్నాయి.
మరో 60 పాయింట్లు పెరిగే అవకాశం...
తాజా మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో, ఆర్బీఐ ధరల పెరుగుదలను నియంత్రించడానికి రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచి 5.40 శాతానికి తీసుకెళ్లింది. తాజా పెంపు రెపో రేటు ప్రీ-పాండమిక్ స్థాయి 5.15 శాతం కంటే ఎక్కువ కావడాన్ని గమనించాలి. వడ్డీ రేటును పెంచడం వల్ల ఎకానమీలో డిమాండ్ తగ్గుతుంది కాబట్టి ధరలూ తగ్గుతాయి. రిటైల్ ఇన్ఫ్లేషన్ ఇప్పుడు వరుసగా ఏడవ నెలలో ఆర్బీఐ అప్పర్ టాలరెన్స్ బ్యాండ్ 6 శాతం కంటే ఎక్కువగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ ఇప్పటి వరకు మూడు సందర్భాల్లో కీలకమైన రెపో రేటును 140 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ ఆర్థిక సంవత్సరంలోపు రెపో రేటును మరో 60 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెపో రేటును 6.0 శాతానికి తీసుకువెళ్లడానికి, సెప్టెంబరులో 35 బేసిస్ పాయింట్లు, డిసెంబరులో మరో 25 బేసిస్ పాయింట్లను పెంచాలని ఆర్బీఐ భావిస్తోంది. డీబీఎస్ గ్రూప్ రీసెర్చ్ చీఫ్ ఎకనామిస్ట్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుద్యోగిత ప్రీ-పాండమిక్ స్థాయికి తిరిగి వచ్చిందని అన్నారు. లేబర్ రేటు 2019 స్థాయిలో లేనప్పటికీ, జీతాలు పెరుగుతున్నాయని వివరించారు. ఇన్‌పుట్ ధరలు పెరగడం, గ్లోబల్ గ్రోత్ ఔట్‌లుక్‌పై అనుమానాలు ఉన్నందున ప్రైవేట్ క్యాపెక్స్ కంటే పబ్లిక్ క్యాపెక్స్ ఎక్కువగా ఉండొచ్చని అన్నారు. వేడిగాలుల ఎఫెక్ట్, వర్షాలు ఆలస్యంగా పడటం వల్ల కమోడిటీల ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని, కార్పొరేట్ మార్జిన్లు తగ్గవచ్చని వివరించారు.