
సిద్దిపేట టౌన్, వెలుగు: కోమటి చెరువు వద్ద సోమవారం జరిగే సద్దుల బతుకమ్మకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన పట్టణంలోని కోమటి చెరువు దగ్గర బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించారు. టూరిజం శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ దీపాలు, సస్పెన్షన్ బ్రిడ్జ్ కు లైట్స్ ఏర్పాటు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం ఏర్పాట్లపై మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు. గతం లో మాదిరిగానే పటిష్ట బందోబస్తు నిర్వహించాలని ఏసీపీని ఫోన్ లో కోరారు. భద్రత ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దన్నారు. మున్సిపల్ అధికారులు, పోలీస్ అధికారులు, టూరిజం అధికారులు సమన్వయంతో మహిళలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచించారు.