ఆసిఫాబాద్/ జైనూర్, వెలుగు : ఆర్‌ఓఎఫ్‌ఆర్ కింద పట్టాలు ఇచ్చిన భూములకు సాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు వెదురు, ఆయిల్‌పామ్, వాణిజ్య పంటలు సాగు చేసేలా ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు.
ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం జాంగావ్, భూసిమెట్ట, కెరమెరి మండలం మోడీ గ్రామాల్లో గురువారం జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు, మహిళా సంఘాలకు లోన్లు, వ్యవసాయ శాఖ తరఫున యంత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జాంగావ్ గ్రామంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పీటీవీజీ కుటుంబాలకు వంద శాతం సబ్సిడీపై ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని ప్రకటించారు.
ఓజా హస్త కళాకారులు తయారుచేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించడంతో పాటు రుణాలు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. హ్యామ్ స్కీమ్‌లో భాగంగా ఉట్నూరు నుంచి ఆసిఫాబాద్ రోడ్డు వెడల్పు కోసం టెండర్లు పిలువబోతున్నట్లు ప్రకటించారు.
కుమ్రంభీం, అమ్మనమడుగు ప్రాజెక్ట్ కెనాల్స్ పూర్తి చేసి రైతులకు సాగు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి, ఎమ్మెల్సీ దండే విఠల్, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్యనాయక్, జీసీసీ చైర్మన్ తిరుపతి, కలెక్టర్ కె.హరిత, ఎస్పీ నితికా పంత్, డీఎఫ్‌వో నీరజ్‌కుమార్ టిబ్రేవాల్, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి, ఏఎస్పీ చిత్తరంజన్ పాల్గొన్నారు.
