- ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం
- రోహిత్‌రెడ్డితో అభిషేక్ సింగ్ డ్రగ్స్ లింకులను ఆరా తీస్తున్న సిట్
- ఐదు వీకెండ్ పార్టీలకూ డ్రగ్స్ సప్లయ్ చేసినట్టు ఆధారాలు
- కాల్ డేటా, బ్యాంక్ అకౌంట్ల ఆధారంగా అభిషేక్ ఎంక్వైరీ
హైదరాబాద్, వెలుగు: రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకున్నది. రోహిత్‌రెడ్డికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న పెడ్లర్ అభిషేక్‌సింగ్‌ను మహేశ్వరం ఎస్‌వోటీ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్‌కు తరలించి సిట్‌అధికారులకు అప్పగించారు. రోహిత్‌రెడ్డి డ్రైవర్ శరత్‌కుమార్ స్టేట్‌మెంట్ ఆధారంగా అభిషేక్ సింగ్‌ను ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది.
రోహిత్ రెడ్డి, అభిషేక్ మధ్య జరిగిన డ్రగ్స్ కొనుగోళ్లపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. వీరి కాల్ డేటా, బ్యాంక్ అకౌంట్ల ఆధారంగా 5 వీకెండ్ పార్టీలు సహా మొత్తం 19 సార్లు రోహిత్ రెడ్డికి అభిషేక్ డ్రగ్స్ సప్లయ్ చేసినట్టు సిట్ గుర్తించింది. గత శనివారం రాత్రి జరిగిన వీకెండ్ పార్టీ కోసం రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్‌కుమార్‌కు కొకైన్ అందించినట్టు సిట్ ఇప్పటికే ఆధారాలు సేకరించింది. ఇందుకు సంబంధించిన పేమెంట్స్‌తోపాటు అభిషేక్ సింగ్ నెట్‌వర్క్‌లో ఉన్న కస్టమర్ల లిస్టును కూడా సంపాదించినట్టు తెలిసింది.
ఫామ్‌హౌస్‌లు, పబ్బులకు డ్రగ్స్..
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అభిషేక్ సింగ్ కొంత కాలంగా డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నాడు. గోవా, బెంగళూరులోని నైజీరియన్స్ వద్ద కొకైన్, ఎండీఎంఏ కొనుగోలు చేసి హైదరాబాద్ తరలిస్తున్నాడు. ఈ క్రమంలోనే శివారు ప్రాంతాల్లోని ఫామ్‌హౌస్‌లలో జరిగే వీకెండ్ పార్టీలకు డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నట్టు సిట్ గుర్తించింది. ఇందులో భాగంగానే రోహిత్ రెడ్డితో పాటు బాబిలోనా పబ్ నిర్వాహకుడు అర్జున్ రెడ్డికి ఆర్డర్లపై డ్రగ్స్ అందిస్తున్నట్టు తెలిసింది.
ఈ మేరకు అభిషేక్ సింగ్ కస్టమర్ల డేటాను సిట్ రాబడుతున్నది. కాగా, రోహిత్‌రెడ్డి డ్రైవర్ శరత్‌కుమార్ స్టేట్‌మెంట్‌ఆధారంగా గతంలో వీకెండ్ పార్టీల్లో పాల్గొన్న వారి వివరాలనూ సేకరిస్తున్నది. న్యాయవాది కౌశిక్ రవితో కూడా అభిషేక్ సింగ్‌కు కాంటాక్ట్స్ ఉన్నాయని గుర్తించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఫామ్‌హౌస్‌లో జరిగిన వీకెండ్ డ్రగ్స్ పార్టీ కోసం ఎంత మేరకు డ్రగ్స్ సప్లయ్ చేశాడనే కోణంలో వివరాలు రాబట్టనున్నట్టు తెలిసింది.
నిందితుడిగా కోళ్ల పెంపకందారు..
రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో కొంత భాగాన్ని ఏలూరుకు చెందిన మొరవనేని రమేశ్ గతంలో లీజుకు తీసుకున్నాడు. ఇందులో నాటుకోళ్లు పెంచడంతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. కాగా, శనివారం వీకెండ్ పార్టీలో తమ నియోజక వర్గానికి చెందిన ఎంపీ పుట్టా మహేశ్‌యాదవ్ వస్తున్నట్టు తెలియడంతో పార్టీకి హాజరయ్యాడు. రోహిత్ రెడ్డి, ఎంపీ మహేశ్ యాదవ్‌తో కలిసి పార్టీలో లిక్కర్ తీసుకున్నాడు.
కాల్పులు జరిగిన సమయంలో అదే స్పాట్‌లో ఉండడంతో పోలీసులకు చిక్కాడు. డ్రగ్స్ టెస్ట్‌లో నెగెటివ్ రావడంతో.. రమేశ్‌ను ఎక్సైజ్ యాక్ట్ సెక్షన్ల కింద నిందితుడిగా చేర్చారు. స్టేషన్ బెయిల్ ఇవ్వడంతోపాటు గత ఐదురోజులుగా రమేశ్‌ను ప్రశ్నిస్తున్నారు. ఫామ్‌హౌస్‌లో గతంలో జరిగిన పార్టీలకు సంబంధించిన వివరాలతో పాటు కాల్పులకు దారి తీసిన విషయాలతో స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు.
