బండి సంజయ్పై కేసు వేస్త.. నాకు ఈడీ నోటీసులిస్తరని ముందే ఎట్ల తెలిసింది ? : రోహిత్ రెడ్డి

బండి సంజయ్పై కేసు వేస్త.. నాకు ఈడీ నోటీసులిస్తరని ముందే ఎట్ల తెలిసింది ? : రోహిత్ రెడ్డి

ఈడీ జారీ చేసిన నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి స్పందించారు. ఆ నోటీసులకు భయపడేది లేదని.. ఈ విషయంలో తగ్గేదే లేదని స్పష్టం చేశారు. లీగల్ ఒపీనియన్ తీసుకొని ముందుకు వెళ్తానన్నారు. బెంగళూరు డ్రగ్స్ కేసులో ఎవరూ తనకు నోటీసులు ఇవ్వలేదన్నారు. తడిగుడ్డలతో యాదగిరి గుట్టలో ప్రమాణం చేయడానికి  తాను సిద్థమని.. బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ అందుకు సిద్ధమా అని సవాల్ విసిరారు. యాదగిరిగుట్టకు ఎప్పుడు వస్తారో డేట్ చెప్పాలన్నారు. ఈడీ నోటీసులు చమత్కారంగా ఉన్నాయని, ఎలాంటి కేసు అనే వివరాలు కూడా అందులో లేవని అన్నారు. నోటీసులో తన బయోడేటా గురించి అడగటం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు.

‘‘నాకు ఈడీ నోటీసులు ఇస్తుందని బండి సంజయ్ ముందే  కామెంట్ చేశారు. ఈ విషయం ఆయనకు ఎలా తెలుసు ?’’ అని రోహిత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంలో బండి సంజయ్ పై కేసు వేస్తానని... సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. బీఎల్ సంతోష్ తప్పు చేయకపోతే ఎందుకు విచారణకు సహకరిస్తలేడని కామెంట్ చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ గుట్టురట్టు చేసిందందుకే ఈ నోటీసులు ఇచ్చారని, తెలంగాణ అభివృద్ధిని చూడలేక కక్షసాధింపు చర్యకు పాల్పడుతున్నారని విమర్శించారు.