IND vs SA: రోహిత్ @ 20000.. నాలుగో భారత క్రికెటర్‌గా అరుదైన ఘనత.. టాప్-3 ఎవరంటే..?

IND vs SA: రోహిత్ @ 20000.. నాలుగో భారత క్రికెటర్‌గా అరుదైన ఘనత.. టాప్-3 ఎవరంటే..?

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన మైల్ స్టోన్ ను అందుకున్నాడు. శనివారం (డిసెంబర్ 6) సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో హాఫ్ సెంచరీతో (60*)అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. విశాఖపట్నం వేదికగా డా.వైయస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో వ్యక్తిగత స్కోర్ 29 పరుగుల వద్ద అంతర్జాతీయ క్రికెట్ లో 20000 పరుగుల మార్క్ చేరుకున్నాడు. 29 పరుగుల వద్ద హిట్ మ్యాన్ ఈ ఘనతను అందుకున్నాడు. బార్ట్ మన్ వేసిన ఇన్నింగ్స్ 15 ఓవర్ రెండో బంతికి రెండు పరుగులు రాబట్టి ఈ అరుదైన లిస్ట్ లోకి చేరాడు. 

రోహిత్ 67 టెస్టుల్లో 4301 పరుగులు చేశాడు. మే 2025లో అతను రెడ్-బాల్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. టీ20 క్రికెట్ లో 4231 పరుగులు చేశాడు. 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డే విషయానికి వస్తే 11499 పరుగులు అతని ఖాతాలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ టీమిండియా ఓపెనర్ కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. రోహిత్ కంటే ముందు 20000 క్లబ్ లో చేరిన ముగ్గురు భారత క్రికెటర్లు ఉన్నారు. సచిన్ టెండూల్కర్ 34357 పరుగులతో అగ్ర స్థానంలో ఉన్నాడు. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ (27910), రాహుల్ (24208) రోహిత్ కంటే ముందు 20000 పరుగుల క్లబ్ లో చేరారు.

ఈ మ్యాచ్ విషయానికి వస్తే 271 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా ప్రస్తుతం వికెట్ కోల్పోకుండా 22 ఓవర్లలో 119 పరుగులు చేసింది. టీమిండియా విజయానికి 28 ఓవర్లలో 152 పరుగులు చేయాలి. చేతిలో 10 వికెట్లు ఉండడంతో ఈ మ్యాచ్ లో ఇండియా విజయం ఖాయంగా కనిపిస్తుంది. అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా క్వింటన్ డి కాక్ (106) సెంచరీతో సౌతాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ బవుమా 48 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. టీమిండియా బౌలర్లలో ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ తలో నాలుగు వికెట్లు పడగొట్టారు.  జడేజా, అర్షదీప్ సింగ్ తలో వికెట్ తీసుకున్నారు.