విజయ్ హజారే ట్రోఫీలో తొలి రోజే రికార్డుల మోత

విజయ్ హజారే ట్రోఫీలో తొలి రోజే రికార్డుల మోత
  • విజయ్ హజారే ట్రోఫీ తొలి రౌండ్‌‌‌‌  సూపర్ హిట్‌‌‌‌
  •     ‘వంద’ కొట్టిన విరాట్ కోహ్లీ, 
  • రోహిత్ శర్మ, ఇషాన్, సూర్యవంశీ  
  •     574/6 స్కోరుతో బీహార్‌‌‌‌ వరల్డ్ రికార్డు

బెంగళూరు/అహ్మదాబాద్‌‌‌‌/ జైపూర్‌‌‌‌:  డొమెస్టిక్ వన్డే క్రికెట్ టోర్నమెంట్‌‌‌‌ విజయ్ హజారే ట్రోఫీలో తొలి రోజే రికార్డుల మోత మోగింది. లెజెండరీ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు తోడు 14 ఏండ్ల  వైభవ్ సూర్యవంశీ వంటి కుర్రాళ్లు సెంచరీలతో కదం తొక్కి అభిమానులకు కిక్‌‌‌‌ ఇచ్చారు.  బీహార్‌‌‌‌‌‌‌‌ 574/6 రన్స్‌‌‌‌ చేసి లిస్ట్‌‌‌‌–ఎ క్రికెట్‌‌‌‌లో అత్యధిక స్కోరుతో వరల్డ్ రికార్డు సృష్టిస్తే.. డిఫెండింగ్ చాంపియన్ కర్నాటక 413 టార్గెట్ ఛేజ్ చేసి మరో ఘనత సాధించింది. మొత్తంగా  పరుగుల మోత మోగి.. అనేక రికార్డులు బద్దలైన వేళ ఇండియా డొమెస్టిక్‌‌ క్రికెట్ తన సత్తానుప్రపంచానికి చాటింది.

సచిన్ రికార్డు బ్రేక్‌‌‌‌ చేసిన విరాట్

15 ఏండ్ల గ్యాప్ తర్వాత ఈ టోర్నీలో బరిలోకి దిగిన  విరాట్ కోహ్లీ (101 బాల్స్‌‌‌‌లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 131) లిస్ట్–ఎ కెరీర్‌‌‌‌‌‌‌‌లో 58వ  సెంచరీ సాధించాడు. దాంతో బుధవారం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌లో జరిగిన మ్యాచ్‌‌‌‌లో ఢిల్లీ  4 వికెట్ల తేడాతో ఆంధ్రను ఓడించింది. ఖాళీ స్టేడియంలో సెంచరీతో కదం తొక్కిన కోహ్లీ లిస్ట్–ఎ క్రికెట్‌‌‌‌లో వేగంగా16 వేల రన్స్ చేసిన క్రికెటర్‌‌‌‌‌‌‌‌గా సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్‌‌‌‌ చేశాడు. సచిన్ 391 ఇన్నింగ్స్‌‌‌‌ల్లో ఈ ఘనత సాధిస్తే.. కోహ్లీ 330వ ఇన్నింగ్స్‌‌‌‌కే అతడిని దాటేశాడు. తొలుత రిక్కీ భుయ్ (122) సెంచరీ కొట్టడంతో ఆంధ్ర 50 ఓవర్లలో 298/8 స్కోరు చేసింది. ఛేజింగ్‌‌‌‌లో కోహ్లీతో పాటు నితీశ్ రాణా (77), ప్రియాంశ్ ఆర్య (74) మెరుపులతో ఢిల్లీ 37.4 ఓవర్లలోనే 300/6 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. ఐదు వికెట్లు తీసిన ఢిల్లీ బౌలర్ సిమర్జీత్ సింగ్ (5/54) ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్ మ్యాచ్‌‌‌‌గా నిలిచాడు.

‘గంభీర్  చూస్తున్నావా.. ఇదీ రోహిత్’

 జైపూర్‌‌‌‌‌‌‌‌లో  12 వేల మంది అభిమానులతో కిక్కిరిసిన ఎస్‌‌‌‌ఎంఎస్ స్టేడియంలో సిక్కింతో జరిగిన మ్యాచ్‌‌‌‌లో ముంబై బ్యాటర్‌‌‌‌‌‌‌‌ రోహిత్ శర్మ (94 బాల్స్‌‌‌‌లో 18 ఫోర్లు, 9 సిక్సర్లతో155)  ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తద్వారా లిస్ట్‌‌‌‌–ఎ క్రికెట్‌‌‌‌లో అత్యధికంగా తొమ్మిదిసార్లు 150 ప్లస్ స్కోర్లు చేసిన బ్యాటర్‌‌‌‌‌‌‌‌గా ఆస్ట్రేలియన్ డేవిడ్ వార్నర్ రికార్డు సమం చేశాడు. తొలుత సిక్కిం 50 ఓవర్లలో 236/7 స్కోరు చేయగా.. ఫ్యాన్స్ కేరింతల నడుమ  ఖతర్నాక్ షాట్లతో అలరించిన రోహిత్‌‌‌‌ మెరుపు ఇన్నింగ్స్‌‌‌‌తో ముంబై 30.3 ఓవర్లలోనే 237/2 స్కోరు చేసి 8 వికెట్ల తేడాతో గెలిచింది.  రోహిత్ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు  అతని నామస్మరణతో స్టేడియం హోరెత్తింది. ‘ ముంబై రారాజు రోహిత్.. గంభీర్ చూస్తున్నావా  ఇదీ రోహిత్ స్టార్‌‌‌‌డమ్’ అంటూ ఫ్యాన్స్ నినాదాలు చేశారు.
కర్నాటక రికార్డు ఛేజింగ్‌‌
అహ్మదాబాద్‌‌‌‌లోని నరేంద్ర మోదీ స్టేడియం –బి గ్రౌండ్‌‌‌‌లో  కర్నాటక, జార్ఖండ్ మధ్య మ్యాచ్ ఉత్కంఠకు తెరలేపింది. తొలుత  ఇషాన్ కిషన్ (39 బాల్స్‌‌‌‌లో 7 ఫోర్లు, 14 సిక్సర్లతో 125)  33 బాల్స్‌‌‌‌లోనే సెంచరీ కొట్టడంతో జార్ఖండ్ 50  ఓవర్లలో 412/ 9 స్కోరు చేసింది.  అనంతరం ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (118 బాల్స్‌‌‌‌లో147) అద్భుత పోరాటంతో కర్నాటక 47.3 ఓవర్లలోనే 413/5 స్కోరు చేసి ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఫలితంగా విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో అత్యధిక టార్గెట్ ఛేజ్‌‌ చేసిన 
జట్టుగా నిలిచింది. 

హైదరాబాద్ పరాజయం

హజారే ట్రోఫీని హైదరాబాద్ ఓటమితో ప్రారంభించింది.  రాజ్‌‌‌‌కోట్‌‌‌‌లో జరిగిన గ్రూప్‌‌‌‌–బి మ్యాచ్‌‌‌‌లో 84 రన్స్ తేడాతో ఉత్తరప్రదేశ్ జట్టు చేతిలో పరాజయం పాలైంది. తొలుత యూపీ 50 ఓవర్లలో 324/5 స్కోరు చేసింది. అనంతరం ఛేజింగ్‌‌‌‌లో హైదరాబాద్ 43 ఓవర్లలో 240 రన్స్‌‌‌‌కే ఆలౌటైంది. తన్మయ్ అగర్వాల్ (53), రాహుల్ బుద్ధి (47), వరుణ్ గౌడ్ (45) పోరాడినా ఫలితం లేకపోయింది. శుక్రవారం విదర్భతో హైదరాబాద్ పోటీ పడనుంది.     


 సూర్యవంశీ, గని సెంచరీలు.. బీహార్‌‌‌‌ రికార్డు స్కోరు‌‌‌‌ 

ప్లేట్ గ్రూప్‌‌‌‌లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్‌‌‌‌తో జరిగిన మ్యాచ్‌‌‌‌లో బీహార్ వరల్డ్  రికార్డు నెలకొల్పింది. మెన్స్ లిస్ట్–ఎ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక స్కోరు 574/6 సాధించిన జట్టుగా బీహార్ అవతరించింది. 2023 సీజన్ హజారే ట్రోఫీలో  ఇదే అరుణాచల్‌‌‌‌పై తమిళనాడు చేసిన 506/2 స్కోరు రికార్డును బ్రేక్ చేసింది. బీహార్‌‌‌‌‌‌‌‌  యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (84 బాల్స్‌‌‌‌లో16 ఫోర్లు, 15 సిక్సర్లతో 190) భారీ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. మెన్స్ లిస్ట్‌‌‌‌–ఎ క్రికెట్‌‌‌‌లో సెంచరీ కొట్టిన యంగెస్ట్ ప్లేయర్‌‌‌‌‌‌‌‌గా 14 ఏండ్ల 272 రోజుల వైభవ్ చరిత్రకెక్కాడు. దాంతో పాటు లిస్ట్‌‌‌‌–ఎలో  వేగంగా 150 రన్స్ (59 బాల్స్‌‌లో) చేసిన బ్యాటర్‌‌‌‌‌‌‌‌గా ఏబీ డివిలియర్స్ (64 బాల్స్‌‌‌‌లో) రికార్డును బ్రేక్ చేశాడు. అయితే అసలు సిసలు మెరుపులు సకీబుల్ గని (40 బాల్స్‌‌‌‌లో 128 నాటౌట్‌‌‌‌) బ్యాట్ నుంచి వచ్చాయి. గని 32 బాల్స్‌‌‌‌లోనే వంద పూర్తి చేసి లిస్ట్-–ఎ క్రికెట్‌‌‌‌లో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన ఇండియన్‌‌‌‌గా రికార్డు సృష్టించాడు.  ఆయుష్ (116) కూడా వంద బాధడంతో బీహార్ రికార్డు స్కోరు సాధించింది.  ఇక, 575  భారీ టార్గెట్ ఛేజింగ్‌‌లో అరుణాచల్ 177 రన్స్‌‌కే కుప్పకూలింది. ఫలితంగా 397 రన్స్ తేడాతో ఓటమి పాలైంది.