IND vs AUS: 25 పరుగులకే టాపార్డర్ పెవిలియన్‪కు.. కోహ్లీ డకౌట్, రోహిత్ సింగిల్ డిజిట్

IND vs AUS: 25 పరుగులకే టాపార్డర్ పెవిలియన్‪కు.. కోహ్లీ డకౌట్, రోహిత్ సింగిల్ డిజిట్

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా తొలి వన్డేలో టీమిండియాకు ఘోరమైన ఆరంభం లభించింది. ఆదివారం (అక్టోబర్ 19) పెర్త్ వేదికగా ప్రారంభమైన తొలి వన్డేలో మొదట బ్యాటింగ్ చేస్తున్న ఇండియా 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఏడు నెలల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్, కోహ్లీ తీవ్రంగా నిరాశపరిచారు. కోహ్లీ డకౌట్ అయితే.. రోహిత్ 8 పరుగులకే పెవిలియన్ కు చేరాడు. తొలిసారి వన్డే కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన గిల్ కూడా 10 పరుగులకే ఔటవ్వడంతో ఇండియా కష్టాల్లో పడింది. 

ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసింది. స్టార్క్, హేజల్ వుడ్ బౌలింగ్ ధాటికి ఓపెనర్లు రోహిత్, గిల్ ఇబ్బందిపడ్డారు. కంగారూల పదునైన బౌలింగ్ ధాటికి మన ఓపెనర్లు తడబడ్డారు. క్రీజ్ లో ఉన్నంత సేపు ఇబ్బంది పడిన రోహిత్ 14 బంతుల్లో 8 పరుగులకే చేసి ఔటయ్యాడు. హేజల్ వుడ్ బౌలింగ్ లో స్లిప్ లి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన కోహ్లీ పరుగుల ఖాతా తెరవడానికి ఇబ్బందిపడ్డాడు. తొలి 6 బంతుల్లో ఒక్క పరుగు కూడా చేయని కోహ్లీ ఒత్తిడిలో పాయింట్ దిశగా షాట్ ఆడి క్యాచ్ ఇచ్చాడు. ఎల్లిస్ తన తొలి ఓవర్లోనే గిల్ ను ఔట్ చేసి ఇండియాను కష్టాల్లో పడేశాడు. 

ఈ దశలో వర్షం కాసేపు అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ను 49 ఓవర్లకు కుదించారు. ప్రస్తుతం 11.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసింది. ఈ దశలో మరోసారి వర్షం అంతరాయం కలిగించింది. క్రీజ్ లో శ్రేయాస్ అయ్యర్ (8), అక్షర్ పటేల్ ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, హేజల్ వుడ్, ఎల్లిస్ లకు తలో వికెట్ లభించింది.