2026 టీ20 వరల్డ్ కప్ కు టీమిండియా కొత్త జెర్సీ ఆవిష్కరణ జరిగింది. భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ టీమిండియా ధరించబోయే కొత్త టీ20 జెర్సీని రివీల్ చేశాడు. బుధవారం (డిసెంబర్ 3) రాయ్‌పూర్‌లో సౌతాఫ్రికాతో టీమిండియా రెండో వన్డే ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఇండియా బ్యాటింగ్ ముగిసిన తర్వాత మిడ్ ఇన్నింగ్స్ లో జెర్సీ ఆవిష్కరణ జరిగింది. వన్డే జట్టులో ఉన్న తిలక్ వర్మ కూడా వేదికపైకి వచ్చి రోహిత్ తో కలిసి జెర్సీ ఆవిష్కరణలో పాల్గొన్నాడు. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియాతో పాటు అడిడాస్ ప్రతినిధులు అధికారికంగా ప్రపంచ కప్ జెర్సీలను వీరిద్దరికి అందజేశారు.
షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో సాయంత్రం లైట్ల కింద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్‌కు ఇండియా ఈ జెర్సీతో బరిలోకి దిగుతుంది. జెర్సీ ముదురు నీలం రంగు బేస్‌ను కలిగి ఉంటుంది. ఇరు వైపులా నారింజ కలర్ లో ప్యానెల్‌లు ఉంటాయి. కీలకమైన డిజైన్ మార్పులో త్రివర్ణ పతాకాన్ని కాలర్ మీద ఉంచారు. నిలువు నీలం చారలు ముందు భాగంలో ఉన్నాయి. టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ వేడుకకు హాజరు కాలేదు. ప్రస్తుతం దేశవాళీ టీ20 టోర్నీ ముస్తాక్ అలీ టోర్నీలో ఆడుతూ సూర్య బిజీగా ఉన్నాడు.
జెర్సీ ఆవిష్కరణ తర్వాత రోహిత్ శర్మ మాట్లాడుతూ.. "ఇది చాలా సుదీర్ఘ ప్రయాణం. మేము 2007లో మా మొదటి ప్రపంచ కప్ గెలిచాం. ఆ తర్వాత వరల్డ్ కప్ గెలవడానికి మాకు 15 సంవత్సరాలు పైగా ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది చాలా ఒడిదుడుకులతో కూడిన సుదీర్ఘ ప్రయాణం. కానీ మళ్ళీ వరల్డ్ కప్ ట్రోఫీని గెలవడం చాలా గొప్పగా అనిపించింది. ఇండియాలో జరుగుతున్న వరల్డ్ కప్ కు ఎంతో ఉత్తేజకరమైన టోర్నమెంట్ కానుంది. నా శుభాకాంక్షలు ఎల్లప్పుడూ జట్టుతో ఉంటాయి. ప్రతి ఒక్కరూ జట్టు వెనక ఉండి సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను". అని మిడ్-ఇన్నింగ్స్ బ్రేక్ లో.. జెర్సీ లాంచ్ వేడుకలో రోహిత్ చెప్పుకొచ్చాడు.
2026 టీ20 వరల్డ్ కప్ కు భారత్, శ్రీలంకలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది. టోర్నమెంట్ లో భాగంగా తొలి మ్యాచ్ ఫిబ్రవరి 7న పాకిస్తాన్- నెదర్లాండ్ మధ్య జరగుతుంది. క్రికెట్ ప్రపంచంలో అత్యంత రసవత్తరంగా, ఫ్యాన్స్ థ్రిల్లింగ్ గా ఫీలయ్యే ఇండియా-పాక్ జట్ల మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబోలో జరగనుంది. ఇండియా, పాకిస్తాన్ , అమెరికా(USA), నమీబియా, నెదర్లాండ్స్ ఒకే గ్రూపులో ఉన్నాయి.
ఈసారి ఈ మెగా టోర్నీలో 20 జట్లు తలపడనున్నాయి. భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, యూఏఈ, ఒమన్, వెస్టిండీస్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే, ఐర్లాండ్, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, ఇటలీ, నేపాల్, పాకిస్థాన్ జట్లు టోర్నమెంట్ లో భాగం కానున్నాయి.
