
హైదరాబాద్, వెలుగు: ఎన్నికల నిర్వహణలో సిబ్బంది అలర్ట్‌గా ఉండాలని.. సమర్థంగా నిర్వహించేందుకు కృషి చేయాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. బుధవారం బంజారాహిల్స్ లోని సేవాలాల్ బంజారా భవన్లో ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ అధికారులు, నియోజకవర్గ స్థాయి మాస్టర్ ట్రైనీలకు, స్పెషల్ ఆఫీసర్లకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ కల్పించారు.
ఈ సందర్భంగా రోనాల్డ్ రాస్ మాట్లాడుతూ..ఎన్నికల నిర్వహణలో కోడ్ ప్రకారం జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ జిల్లాలోని 15 సెగ్మెంట్లలో ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది.. సుమారు 34 వేల మందిని నియమించామన్నారు. పోలింగ్‌కు ముందు రోజు పోలింగ్ రోజున పీవో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎన్నికల నియమావళి అంశాల గురించి వివరించారు.
పోలింగ్ రోజు ముందుగా మాక్ పోలింగ్‌ను పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో నిర్వహించి అనంతరం మాక్ పోల్‌ను సర్టిఫై చేయాలని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డిఈవో, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అడిషనల్ కమిషనర్ శంకరయ్య, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ వెంకటేష్ దోత్రే, కంటోన్మెంట్ సీఈవో మధుకర్ నాయక్, జాయింట్ కమిషనర్ వెంకట్ రెడ్డి, సునంద తదితరులు పాల్గొన్నారు.