
హైదరాబాద్, వెలుగు : ప్రజా పాలన కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్ అధికారులకు సూచించారు. ఆదివారం జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు , జోనల్ స్థాయి అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రోనాల్డ్ రాస్ మాట్లాడుతూ.. గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న 150 డివిజన్లలో ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు ప్లానింగ్ రూపొందించాలన్నారు.
మహాలక్ష్మి, రూ. 500కే గ్యాస్ సిలిండర్ స్కీమ్స్ కోసం జనాల నుంచి దరఖాస్తులు తీసుకోవాలన్నారు. ప్రతి డివిజన్లో నాలుగు టీమ్స్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 6 గంటల వరకు షిప్టుల వారీగా దరఖాస్తులు స్వీకరించాలన్నారు. లబ్ధిదారులు దరఖాస్తుతో పాటు తమ ఆధార్ కార్డు, రేషన్ కార్డును జత చేయాలన్నారు. మహిళల కోసం ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేయాలన్నారు.
ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించే లొకేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని జనానికి ముందస్తుగా తెలియజేయాలన్నారు. స్థానిక ఎమ్మెల్యేలను ఆహ్వానించాలని, ప్రజా పాలనపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించాలన్నారు. సమావేశంలో హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అడిషనల్ కమిషనర్లు శృతి ఓజా, స్నేహా శబరీష్, ఉపేందర్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ అధికారులు పాల్గొన్నారు.