
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. సోమవారం జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో సిటీ సీపీ ఆనంద్. కలెక్టర్ అనుదీప్‌తో కలిసి ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ జిల్లా పరిధిలో 15 సెగ్మెంట్లు ఉండగా.. మొత్తం 44 లక్షల 42 వేల 458 ఓటర్లు ఉన్నారన్నారు.
ఇందులో పురుషులు 22 లక్షల 79 వేల 617, మహిళలు 21 లక్షల 62 వేల 541, ట్రాన్స్ జెండర్స్ 300 మంది ఉన్నట్లు ఆయన చెప్పారు. అవకాశం ఉన్నవారు కొత్త ఓటు హక్కు కోసం అప్లయ్ చేసుకోవచ్చన్నారు. ఎన్నికల కోసం అవసరమైన అన్ని ఈవీఎం మెషీన్లు, ఇతర సామగ్రి అందుబాటులో ఉందని రోనాల్డ్ రాస్ వివరించారు. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో1,665 లొకేషన్లలో 3,931 పోలింగ్ కేంద్రాలు, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 21 లొకేషన్లలో 51 పోలింగ్ కేంద్రాలు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో రెండు లొకేషన్లలో 4 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. 34,452 మంది పోలింగ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఎలక్షన్ డ్యూటీ చేస్తారన్నారు.
హైదరాబాద్ పరిధిలో 18 చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేశామన్నారు. 90 ఫ్లయింగ్ స్క్వాడ్ లు ఏర్పాటు చేశామని, వీడియో విక్వింగ్ ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో టీమ్ పని చేస్తాయన్నారు. మద్యం, డబ్బు రవాణాపై ప్రత్యేక నిఘా పెడతామన్నారు. అనంతరం హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 430 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, 1,587 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లుగా గుర్తించామన్నారు. 32 కేంద్ర బలగాలు అవసరం ఉండొచ్చని భావిస్తున్నామన్నారు. గతంలో జరిగిన కేసులు, గొడవలను దృష్టిలో పెట్టుకొని క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించామన్నారు. మద్యం,డబ్బులు పంపిణీ, రవాణాపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు.
మత్తు పదార్థాలపై స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు. లైసెన్స్ ఉన్న వారు గన్లు తీసుకొని బయట తిరగొద్దన్నారు. 2,252 నాన్ బెయిలబుల్ వారెంట్స్ పెండింగ్‌లో ఉన్నాయని సీపీ తెలిపారు. రౌడీలు, గూండాలపై ప్రివెంటివ్ యాక్షన్స్ తీసుకుంటామని, 652 మందిని బైండోవర్ చేశామన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 24 గంటల పాటు మూడు టీమ్స్ పనిచేస్తాయన్నారు. అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని ముందుకుపోతామన్నారు. ఆన్లైన్ డబ్బులు పంపిణీ, ట్రాన్స్ ఫర్లపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. 15 సెగ్మెంట్లలో 15 మంది నోడల్ ఆఫీసర్లను నియమించామన్నారు. బ్యాంక్ సాయం తీసుకుని డిజిటల్ పేమెంట్‌పై ఫోకస్ చేయబోతున్నామన్నారు.