
ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం
రెండు రోజుల క్రితమే రిపేర్లు చేయించాలన్న సెషన్స్ జడ్జి
లైట్ తీసుకున్న అధికారులు
గద్వాల టౌన్, వెలుగు : గద్వాల జిల్లా కేంద్రంలోని బీసీ హాస్టల్ పైకప్పు పెచ్చులు ఊడి పడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గద్వాలలోని బీసీ కాలనీలోని బీసీ హాస్టల్లో 200 మంది విద్యార్థులుంటున్నారు. సుమారు 40 ఏండ్ల క్రితం దీన్ని నిర్మించారు. హాస్టల్స్ తనిఖీలో భాగంగా రెండు రోజుల కింద ఎస్సీ హాస్టల్‌తో పాటు బీసీ హాస్టల్‌ను గద్వాల జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి గంటా కవితా దేవి పరిశీలించారు. అక్కడక్కడా పెచ్చులు ఊడి కనిపించడంతో బిల్డింగ్ ప్రమాదకరంగా ఉందని, రెండు రోజుల్లో రిపేర్లు చేయించాలని లేదా విద్యార్థులను వేరే చోటికి తరలించాలని కలెక్టర్‌తో పాటు మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.
అయినా వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బుధవారం సాయంత్రం బిల్డింగ్‌లోని కిచెన్ ముందు భాగంతో పాటు బయట కూడా పెచ్చులు ఊడిపడ్డాయి. అదృష్టవశాత్తు అక్కడ విద్యార్థులెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దీంతో స్టూడెంట్స్ ఎప్పుడేం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తమను వేరే చోటికి పంపించాలని, రిపేర్లన్నా చేయించాలని వేడుకుంటున్నారు.