కేసీఆర్​ను జైలుకు పంపాలి : ఆకునూరి మురళి

కేసీఆర్​ను జైలుకు పంపాలి : ఆకునూరి మురళి
  • కేసీఆర్​ను జైలుకు పంపాలి 
  • ‘కాళేశ్వరం’పై అత్యున్నత దర్యాప్తు జరిపించాలి: ఆకునూరి మురళి
  • సీబీఐ కాదు జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో కమిటీ వేయాలి
  • కాళేశ్వరం విచారణపై ప్రెస్​క్లబ్​లో రౌండ్​ టేబుల్​ సమావేశం

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలకు అప్పటి సీఎం కేసీఆరే బాధ్యుడని.. ఆయనను జైలుకు పంపాల్సిందేనని రిటైర్డ్​ ఐఏఎస్, జాగో తెలంగాణ కన్వీనర్ ​ఆకునూరి మురళి డిమాండ్​చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో జాగో తెలంగాణ, తెలంగాణ జలసాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘‘కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించి.. దోషులను శిక్షించి, అవినీతి సొమ్ము ప్రజా ఖజానాకు జమ చేయాలి” అనే అంశంపై నిర్వహించిన రౌండ్​టేబుల్​సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ తన మెదడును కరిగించి ప్రాజెక్టు డిజైన్ ​చేశానని, కడుపుకట్టుకొని పూర్తి చేశానని పలుమార్లు చెప్పారు కాబట్టి జైలుకు వెళ్లాల్సిన జాబితాలో మొదటి పేరు ఆయనదేనన్నారు. 

కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలకు పాల్పడ్డ వారిపై అత్యున్నత స్థాయి కమిటీ ద్వారా విచారణ జరిపించాలని, సిట్టింగ్​జడ్జితో, సీబీఐతో విచారణ అంటే దోషులు తప్పించుకునే అవకాశముందని అనుమానం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలకు పాల్పడి జైలుకు వెళ్లే వారి జాబితా రెడీ చేయాలన్నారు. ప్రాజెక్టు నుంచి 2 టీఎంసీలే ఎత్తిపోయనప్పుడు థర్డ్​టీఎంసీ పనులు చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఎప్పుడు జైలుకు వెళ్లాల్సి వస్తుందా అని భయపడాల్సిన కేటీఆర్, హరీశ్​రావు ఎంతో ధైర్యంగా మాట్లాడుతున్నారంటే సీబీఐ, జ్యూడీషియల్​ తో ఏమీ కాదన్న ధైర్యమేనని ఆరోపించారు. భవిష్యత్​లో ఇంకెవరూ ఇలాంటి అక్రమాలకు పాల్పడకుండా ఉండేందుకు కాళేశ్వరం అక్రమాల్లో బాధ్యులైన రాజకీయ నాయకులు, అధికారులు, ఇంజనీర్లందరినీ జైలుకు పంపాలని డిమాండ్​చేశారు.

వర్షాలతోనే పంటలు పెరిగాయి..

ఇరిగేషన్​ప్రాజెక్టుల కింద ఆయకట్టు స్థిరీకరణ అనేది పెద్ద జోక్, భోగస్ అని ఆకునూరి మురళి ఎద్దేవా చేశారు. ఎస్సారెస్పీ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీళ్లు ఇవ్వలేకపోయిన ఇంజనీర్లపై అప్పుడే చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడు కాళేశ్వరం కింద ఆ ఆయకట్టును స్థిరీకరించామనే ముచ్చటే వచ్చేది కాదని ఆయన గుర్తు చేశారు. దేశంలోనే రూ.4,500 కోట్ల పనులను నామినేషన్​పద్ధతిన ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ, ప్రాజెక్టు కాళేశ్వరం మాత్రమేనన్నారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు నీటి లభ్యతపై తప్పుడు రిపోర్టు ఇచ్చిన వ్యాప్కోస్​ను రద్దు చేయాలని డిమాండ్​చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు 15 లక్షల బోర్లు ఉంటే, రైతులు ఇంకో 15 లక్షల బోర్లు కొత్తగా వేశారని, తొమ్మిదిన్నరేళ్లుగా సమృద్ధిగా వర్షాలు కురవడంతో పంటలు ఎక్కువ పండాయి తప్ప అందులో కాళేశ్వరం మహిమ ఏమి లేదని గుర్తు చేశారు. సీబీఐ, ఈడీ, ఐటీ బీజేపీ జేబు సంస్థలని అందుకే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో నిపుణులతో కూడిన హైలెవల్​కమిటీని ఏర్పాటు చేసి కాళేశ్వరం అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్​చేశారు.

పక్షపాతం లేకుండా విచారణ జరపాలి:జస్టిస్​ చంద్రకుమార్​

కాళేశ్వరం అక్రమాల్లో బాధ్యులుగా ఉన్న ఇంజనీర్లు అప్రూవర్లుగా మారుతారో లేదా నేరస్తులుగా మారుతారో తేల్చుకోవాలని జస్టిస్​చంద్రకుమార్​సూచించారు. వ్యాప్కోస్​చైర్మన్​గా పని చేసిన రాజేంద్రన్​ఇంటిపై రైడ్స్​చేస్తే రూ.35 కోట్ల నగదు దొరికిందని, అందులో తెలంగాణ నుంచి వెళ్లిన సొమ్మెంతో లెక్క తేల్చాలన్నారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన పెద్ద ప్రాజెక్టు కాబట్టి ఎలాంటి పక్షపాతం లేకుండా దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్​చేశారు. కేసీఆర్​కు పదవులు రాలేదు కాబట్టే తెలంగాణ ఉద్యమం చేశారు తప్ప పదవులు ఇస్తే ఆయన వాళ్ల కాళ్ల కాడనే పడి ఉండేవారని ఆరోపించారు. కాళేశ్వరంలో జరిగిన దొంగతనాన్ని ప్రకృతి పసిగట్టింది కాబట్టే బ్యారేజీ కుంగి, పంపుహౌస్​లు మునిగాయని తెలిపారు. 

ఇంజనీర్లను వదలొద్దు: పాశం యాదగిరి

అమెరికా లాంటి దేశాల్లో ప్రాజెక్టులు, రిజర్వాయర్లు కూల్చేస్తుంటే ఇక్కడ ప్రకృతిని విధ్వంసం చేస్తూ ప్రాజెక్టులు ఎందుకు నిర్మిస్తున్నారని సీనియర్​జర్నలిస్టు పాశం యాదగిరి ప్రశ్నించారు. ఇలాంటి ప్రాజెక్టులు డిజైన్​చేసే ఇంజనీర్లను వదలొద్దని ఆయన తెలిపారు. తుమ్మిడిహెట్టి దగ్గర ఇప్పటికిప్పుడు బ్యారేజీ నిర్మించకుండా నీటిని మళ్లించుకునే అవకాశముందని రిటైర్డ్​ఎస్ఈ నల్లవెల్లి రంగారెడ్డి అన్నారు. కాళేశ్వరం రీ డిజైన్​అనేది రాజకీయ నిర్ణయమని, బ్యారేజీల నిర్మాణానికి సరైన ఇన్వెస్టిగేషన్స్​చేసి వాటికి అనుగుణంగా డిజైన్​చేసి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని చెప్పారు. ఫ్లోటింగ్​ స్ట్రక్చర్​ గా డిజైన్ ​చేసి రిజర్వాయర్​గా మేడిగడ్డను మార్చడంతోనే దానిపై ఒత్తిడి పడి బ్యారేజీ పిల్లర్లు కుంగాయని వివరించారు. ఇప్పటికైనా సమస్యను క్షుణ్నంగా అధ్యయనం చేసి తదుపరి చర్యలు చేపట్టాలని సూచించారు. 

బాధ్యుడు కేసీఆరే: నైనాల గోవర్ధన్​

కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలకు కేసీఆరే బాధ్యుడు అని తెలంగాణ జలసాధన సమితి కన్వీనర్​నైనాల గోవర్ధన్​అన్నారు. ఈ అక్రమాలతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారు తిన్న సొమ్మంతా కక్కించాలన్నారు. బ్యారేజీ పునరుద్ధరణపై ఎల్​అండ్​టీ సంస్థ రాసిన లేఖను బయట పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఇంజనీర్లు దొంతుల లక్ష్మీనారాయణ, వెంకటరమణ వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.