మంచిర్యాల జిల్లాలో రౌడీ గ్యాంగుల ఆగడాలు

మంచిర్యాల జిల్లాలో రౌడీ గ్యాంగుల ఆగడాలు
  •     గంజాయి, మద్యం మత్తులో వీరంగం 
  •     భూ దందాలు,  సెటిల్​మెంట్లతో జనం బెంబేలు  
  •     గ్యాంగ్​వార్​లో బలవుతున్న అమాయకులు 

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలో రౌడీషీటర్లు, ఆకతాయి గ్యాంగుల ఆగడాలు మితిమీరుతున్నాయి. భూదందాలు, సెటిల్​మెంట్లు, మర్డర్లు, ఈవ్​టీజింగ్​లకు పాల్పడుతూ దడ పుట్టిస్తున్నారు. రాత్రిళ్లు బలాదూర్​గా తిరుగుతూ జనాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కొంతమంది రాజకీయ నాయకులు, బడా వ్యక్తులు వారి అవసరాల కోసం వీళ్లను పెంచి పోషిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు కోల్​బెల్ట్​ ఏరియాలో రౌడీ గ్యాంగులు హల్​చల్​ చేసేవి. ప్రస్తుతం రామగుండం పోలీస్​కమిషనరేట్​పరిధిలో 357 మంది రౌడీషీటర్లు ఉన్నారు. గోదావరిఖని సబ్​డివిజన్​లో 109, పెద్దపల్లిలో 70, మంచిర్యాలలో 50, జైపూర్​లో 48, బెల్లంపల్లి సబ్​డివిజన్​లో 115 మంది ఉన్నారు.

వీళ్లలో చాలామంది క్రిమినల్​ కేసులు, పోలీసుల నిఘా కారణంగా ప్రస్తుతం నేరాలకు దూరంగా జీవిస్తున్నారు. అదే సమయంలో కొత్త గ్యాంగులు పుట్టుకొస్తున్నాయి. పనీపాటా లేకుండా జులాయిగా తిరుగుతున్న యువకులు గంజాయి, మద్యానికి బానిసలై నేరప్రవృత్తి వైపు అడుగులు వేస్తున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కొంతమంది లీడర్లు, రియల్టర్లు ఆకతాయి యువకులను చేరదీసి మద్యం, మాంసాలతో విందులు ఏర్పాటు చేస్తూ, జేబు ఖర్చులకు పైసలు ఇస్తూ వారి రాజకీయ అవసరాల కోసం, భూదందాల్లో వీళ్లను పావులుగా వాడుకుంటున్నారు. ఈ సంస్కృతి రెండు జిల్లాల్లోని కోల్​బెల్ట్​ పట్టణాల్లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. మరికొందరు యువకులు గ్రూపులుగా ఏర్పడి భూదందాలు, సెటిల్​మెంట్లలో తలదూరుస్తున్నారు. దొంగతనాలు, ఈవ్​టీజింగ్​లకు పాల్పడుతున్నారు. తమ వ్యవహార శైలితో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.  

అర్ధరాత్రి మద్యం మత్తులో..

మంచిర్యాల జిల్లా కేంద్రంతో పాటు నస్పూర్, శ్రీరాంపూర్, మందమర్రి, రామకృష్ణాపూర్, బెల్లంపల్లి పట్టణాల్లో అర్ధరాత్రి వేళల్లో ఆకతాయి గ్యాంగ్​లు హల్​చల్​ చేస్తున్నాయి. బస్టాండ్​లు, రైల్వేస్టేషన్ల పరిసర ప్రాంతాలే వీరికి అడ్డాలుగా మారుతున్నాయి. రాత్రి 10 గంటలకు వైన్స్, 11గంటలకు బార్లు క్లోజ్​ చేయాల్సి ఉండగా, కొన్నిచోట్ల అర్ధరాత్రి వరకు గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్నాయి. బార్లు, హోటళ్లు 12 గంటల తర్వాత నడుస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పలు వైన్స్​పదింటికి మూసివేసి పక్కన, వెనుక నుంచి మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. బార్లు కూడా ముందు వైపు షట్టర్లు క్లోజ్ చేసి ఒంటిగంట వరకు నడుపుతున్నారు. కొన్ని పాన్​షాపులు అర్ధరాత్రి వరకు ఓపెన్​ చేసి ఉంటున్నా పోలీసులకు కనిపించడం లేదు. దీంతో ఆకతాయిలు రాత్రిళ్లు మద్యం మత్తులో రోడ్లపై వీరంగం చేస్తున్నారు. చౌరస్తాల్లో బర్త్​డేలు జరుపుకొంటూ ప్రజలను భ్రయభ్రాంతులకు గురిచేస్తున్నారు. గతంలో ఆపరేషన్ ఛబుత్ర పేరుతో పోలీసులు రాత్రివేళ బయట తిరుగుతున్న వాళ్లను అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్​ ఇచ్చారు. ప్రస్తుతం అది కనిపించకపోవడంతో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు.    

గ్యాంగ్​వార్​కు యువకుడు బలి  

జిల్లాలో ఇటీవల రెండు గ్యాంగుల మధ్య జరిగిన గొడవలో అమాయక యువకుడు బలయ్యాడు. మందమర్రి మండలం ఎర్రగుంటపల్లికి చెందిన పోశంపల్లి సంపత్​(35) మంచిర్యాలలో బజాజ్ ఫైనాన్స్​లో రికవరీ ఏజెంట్​గా పనిచేస్తూ 15 మందితో ఓ గ్యాంగ్​ను మెయింటెయిన్​ చేస్తున్నాడు. ఇతడిపై మందమర్రి, సీసీసీ నస్పూర్, హాజీపూర్, మంచిర్యాల, భీమిని, కరీంనగర్ రూరల్​ పోలీస్ స్టేషన్​లో కేసులు ఉన్నాయి. మందమర్రి పోలీస్ స్టేషన్​లో రౌడీషీట్ ఓపెన్​ చేశారు. జల్సాలకు అలవాటుపడి చిన్న చిన్న సెటిల్​మెంట్లు చేస్తున్నాడు. సీసీసీ నస్పూర్​కు చెందిన మరో గ్యాంగ్ స్టర్​రాజేందర్​తో సెటిల్​మెంట్ల విషయంలో శత్రుత్వం ఏర్పడింది. నాలుగేండ్లలో చాలాసార్లు గొడవపడ్డారు. గతనెల 29న శ్రీరాంపూర్ బస్​స్టాండ్​ వద్ద రాజేందర్​అతడి గ్యాంగ్​తో ఉన్నాడనే సమాచారంతో సంపత్​ గ్యాంగ్​అక్కడికి చేరుకుంది. విషయం తెలుసుకున్న రాజేందర్​అక్కడినుంచి పారిపోయాడు. సీసీసీ నస్పూర్​కు చెందిన వంశీ బైక్​పై వచ్చి అక్కడ ఫోన్​కాల్​ మాట్లాడుతుండగా అతడిని రాజేందర్ ఇన్​ఫార్మర్​గా భావించి కొట్టారు. అక్కడే ఉన్న నస్పూర్​కు చెందిన అనిల్​కుమార్ వంశీని ఎందుకు కొడుతున్నారని అడ్డుకోగా అతడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. బాధితుడు హాస్పిటల్​లో చికిత్స పొందుతూ రెండ్రోజుల తర్వాత చనిపోయాడు. ఈ కేసులో పోలీసులు 12 మందిని అరెస్ట్​ చేయగా, ముగ్గురు పరారీలో ఉన్నారు.       

కఠిన చర్యలు తీసుకుంటాం 

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. రౌడీషీటర్లు ఎటువంటి శాంతిభద్రతల సమస్యలు సృష్టించినా చర్యలు తప్పవు. చెడు వ్యసనాలకు బానిసలై అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్న వారిపై కూడా చట్టపరమైన చర్యలు చేపడతాం. నేరాలు, దౌర్జన్యాలు, అక్రమాలు, బెదిరింపులకు సంబంధించి ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రౌడీయిజం, భూకబ్జాలకు పాల్పడేవారు, మహిళలపై అత్యాచారాలు, వేధింపులకు పాల్పడేవారిపై రౌడీషీట్లు ఓపెన్​ చేస్తాం. 

- అఖిల్​మహాజన్, మంచిర్యాల ఇన్​చార్జి డీసీపీ ​