హైదరాబాద్​ పాతబస్తీలో రౌడీ షీటర్ ని చంపేశారు

హైదరాబాద్​ పాతబస్తీలో రౌడీ షీటర్ ని చంపేశారు
  • హతుడు అక్బరుద్దీన్​ ఓవైసీపై దాడి కేసులో సాక్షి

పాతబస్తీలోని బండ్లగూడ ప్రాంతంలో ఆగస్టు 10 అర్థరాత్రి రౌడీషీటర్ హత్యకు గురికావడం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయల్ సీ హోటల్ సమీపంలోని బుఫ్​టైం బిల్డింగ్ 1వ అంతస్తులో ఉన్న షేక్ సయీద్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ బవాజీర్(27)పై అహ్మద్ బిన్ హజాబ్ మారణాయుధాలతో దాడి చేశాడు. 

తీవ్ర గాయాలపాలైన అతను రక్తపు మడుగులో విలవిల్లాడుతూ అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుడు పరారీ కాగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న బండ్లగూడ పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. 

మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి షేక్ అబ్దుల్ రహ్మాన్ బిన్ సయీద్ మాట్లాడుతూ..  బవజీర్ అహ్మద్ సాదీ (జల్పల్లి ఇంచార్జి, -ఎంఐఎం పార్టీ), అబ్దుల్లా సాదీ (జల్పల్లి చైర్మన్, -ఎంఐఎం పార్టీ), సలేహ్ సాదీ, ఇక్బాల్ బిన్ ఖలీఫా, సల్లం బిన్ ఖలీఫాలు తన కుమారుడిని హత్య చేశారని ఆరోపించారు. 

చాంద్రాయణగుట్టలోని బార్కాస్ లో 2011లో అప్పటి స్థానిక ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై దాడి కేసులో మృతుడు సాక్షిగా ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.