IPL 2025: పాకిస్థాన్‌ను చితక్కొడినోడు RCB జట్టులో.. ఇంగ్లాండ్ క్రికెటర్‌కు రీప్లేసెమెంట్ అదిరింది

IPL 2025: పాకిస్థాన్‌ను చితక్కొడినోడు RCB జట్టులో.. ఇంగ్లాండ్ క్రికెటర్‌కు రీప్లేసెమెంట్ అదిరింది

ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్ కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక మార్పు చేసింది. ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ జాకబ్ బెతేల్ స్థానంలో టిమ్ సీఫెర్ట్‌ ఆర్సీబీ జట్టులో చేరనున్నాడు. ఇంగ్లాండ్  మే 29 నుంచి వెస్టిండీస్ తో వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది. జాతీయ విధుల దృష్ట్యా బెతేల్ ప్లే ఆఫ్స్ కు ముందు ఇంగ్లాండ్ వెళ్లనున్నాడు. దీంతో ఈ ఇంగ్లీష్ ఆల్ రౌండర్ కు రీప్లేస్ మెంట్ గా బెంగళూరు ఫ్రాంచైజీ కివీస్ ఓపెనర్  సీఫెర్ట్‌ ను జట్టులోకి చేర్చుకోనుంది. త్వరలో ఈ న్యూజిలాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ మే 24న RCB జట్టులో చేరతాడు.

"జాకబ్ బెథెల్ టాటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 నుండి నిష్క్రమించి ఇంగ్లాండ్ జట్టులో చేరనున్నందున రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టిమ్ సీఫెర్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది" అని ఐపీఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. టిమ్ సీఫెర్ట్ ను ఆర్సీబీ  ఫ్రాంచైజీ రూ. 2 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. ప్లే ఆఫ్స్ మ్యాచ్ లకు సీఫెర్ట్ అందుబాటులో ఉండనున్నాడు. న్యూజిలాండ్ కు చెందిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో పాకిస్థాన్ పై విశ్వ రూపం చూపించాడు. 

పాకిస్థాన్ తో జరిగిన 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో సీఫెర్ట్‌ వరుసగా 44, 45,19,44, 97 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఇటీవలే జరిగిన పాకిస్థాన్ సూపర్ లీగ్ లో లాహోర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఓవరాల్ గా 66 టీ20 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ల్లో 1540 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 97* కాగా.. వీటిలో 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం ఆర్సీఈబీ జట్టులో ఓపెనర్ గా సాల్ట్ ఉన్నాడు. ఒకవేళ సాల్ట్ పూర్తి ఫిట్ నెస్ సాధించకాపోతే అతని స్థానంలో సీఫర్ట్ కోహ్లీతో కలిసి ఓపెనింగ్ కు దిగుతాడు. 

ఈ సీజన్ లో ఆర్సీబీ ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించగా.. టాప్ 2 పై దృష్టి పెట్టింది. ప్రస్తుతం పటిదార్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 12 మ్యాచ్ ల్లో 17 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఆర్సీబీ మరో రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించిన పటిదార్ సేన మిగిలిన రెండు మ్యాచ్ ల్లో గెలిస్తే టాప్ 2 లో నిలుస్తుంది. అప్పుడు ఫైనల్ చేరడానికి రెండు అవకాశాలు ఉంటాయి. మే 23 న సన్ రైజర్స్ హైదరాబాద్‎తో.. మే 27 న లక్నో సూపర్ జయింట్స్‎తో తలపడనుంది.