- 4 వికెట్లతో రవి బిష్ణోయ్ మ్యాజిక్
- రాణించిన ధ్రువ్ జురెల్, జైస్వాల్
అహ్మదాబాద్: ఆఖరి బాల్ వరకూ ఉత్కంఠ రేపిన పోరులో గుజరాత్ టైటాన్స్‌కు చెక్ పెట్టిన రాజస్తాన్ రాయల్స్.. ఐపీఎల్–19లో రెండో విజయాన్ని అందుకుంది. ఛేజింగ్‌లో ఇంపాక్ట్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ (4/41) సూపర్ బౌలింగ్‌తో ప్రత్యర్థిని చేయడంతో పాటు బ్యాటింగ్‌లో ధ్రువ్ జురెల్ (42 బాల్స్‌లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 75), యశస్వి జైస్వాల్ (36 బాల్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 55) హాఫ్ సెంచరీలతో మెరవడంతో.. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో రాయల్స్ 6 రన్స్ తేడాతో గుజరాత్‌పై నెగ్గింది.
టాస్ నెగ్గిన రాజస్తాన్ 20 ఓవర్లలో 210/6 స్కోరు చేసింది. వండర్ బాయ్ వైభవ్ సూర్యవంశీ (31)తో కలిసి జైస్వాల్ తొలి వికెట్‌కు 6.2 ఓవర్లలోనే 70 రన్స్ జోడించి గట్టి పునాది వేశాడు. వన్‌డౌన్‌లో జురెల్ గుజరాత్ బౌలర్లను ఉతికేశాడు. రియాన్ పరాగ్ (8) నిరాశపర్చినా.. హెట్‌మయర్ (18) ఉన్నంతసేపు వేగంగా ఆడాడు. అనంతరం ఛేజింగ్‌లో గుజరాత్ 20 ఓవర్లలో 204/8 స్కోరుకే పరిమితమైంది. సాయి సుదర్శన్ (73) సత్తా చాటాడు. 11వ ఓవర్‌లో సుదర్శన్‌ను ఔట్ చేసిన బిష్ణోయ్ 13వ ఓవర్‌లో మూడు బాల్స్ తేడాలో గ్లెన్ ఫిలిప్స్ (3), వాషింగ్టన్ సుందర్ (4)ను పెవిలియన్‌కు పంపాడు.
తర్వాత 15వ ఓవర్‌లో రాహుల్ తెవాటియా (12)ను ఔట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. చివర్లో రషీద్ ఖాన్ (24), రబాడ (23 నాటౌట్) భారీ షాట్లతో గుజరాత్‌ను గెలుపు ముంగిట నిలిపారు. చివరి రెండు ఓవర్లలో ఆ టీమ్‌కు 15 రన్స్ అవసరం కాగా అద్భుతంగా బౌలింగ్ చేసిన జోఫ్రా ఆర్చర్, తుషార్ చెరో నాలుగు రన్సే ఇచ్చి రాజస్తాన్‌ను గెలిపించారు. బిష్ణోయ్‌కు‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.
