
దసరాకి రావాల్సిన ‘ఆర్ఆర్‌ఆర్’ సినిమా సంక్రాంతికి షిప్ట్ అయింది. ‘బాహుబలి’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి తీస్తున్న ప్యాన్ ఇండియా మూవీ కావడం, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి ఇద్దరు స్టార్స్ నటిస్తుండటంతో దేశం చూపంతా ఈ సినిమాపైనే ఉంది. అయితే ‘ఆర్ఆర్ఆర్’ ఎఫెక్ట్ తో ఆల్రెడీ సంక్రాంతి రేసులో బెర్త్ కన్‌ఫర్మ్ చేసుకున్న తెలుగు సినిమాలన్నీ తమ రిలీజ్ డేట్స్ మార్చుకునే పనిలో పడ్డాయి. ఆల్రెడీ ‘ఎఫ్ 3’ని వాయిదా వేశారు. మిగతా సినిమాలు కూడా అదే బాటలో ఉన్నాయి. అయితే ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ మాత్రం ఇంకా ఎలాంటి ప్రమోషనల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేయలేదు. సరిగ్గా సినిమా రిలీజ్‌కి రెండు నెలలు ఉందనగా ప్రమోషన్ స్టార్ట్ చేస్తారట. దీపావళి నుంచి ఈ ప్రమోషన్ జోరు ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. ఇటు సౌత్‌తో పాటు అటు నార్త్‌లోనూ దీపావళి పెద్ద పండుగ. అందుకే ఆరోజున టీజర్ రిలీజ్ చేయబోతున్నారట. ఇప్పటికే చరణ్, తారక్ పాత్రలకి సంబంధించి విడివిడిగా టీజర్స్ వదిలారు. ‘దోస్తీ’ పేరుతో ప్రమోషనల్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడీ ఇద్దరి క్యారెక్టర్స్‌తో ఓ స్పెషల్ టీజర్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. మూవీ మెయిన్ కాన్సెప్ట్‌ని ఇందులో చూపించబోతున్నారట. ఈ నెలాఖరులో టీజర్ రిలీజ్ గురించిన అనౌన్స్‌మెంట్ ఇవ్వనున్నారు. ఇక తన సినిమాల ప్రమోషన్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకునే రాజమౌళి, హైదరాబాద్‌తో పాటు చెన్నై, ముంబై, బెంగళూరు, కొచ్చి లాంటి నగరాల్లో ఈవెంట్స్ నిర్వహించి ఈ మూవీని ప్రమోట్ చేయబోతున్నారట. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.