RRR మరో ఘనత...రాజమౌళికి అంతర్జాతీయ అవార్డు

RRR మరో ఘనత...రాజమౌళికి  అంతర్జాతీయ అవార్డు

ఇప్పటికే శాటర్న్, సన్ సెట్ సర్కిల్ వంటి ఇంటర్నేషనల్ అవార్డులు అందుకున్న ‘ఆర్ఆర్ఆర్’ మరో ఘనత సాధించింది. హాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ది న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్’ అవార్డు దక్కింది. అమెరికాలో లేటెస్ట్ గా నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ డైరెక్టర్ రాజమౌళికి ‘బెస్ట్ డైరెక్టర్’ అవార్డ్ దక్కింది. హాలీవుడ్ డైరెక్టర్లతో సైతం పోటీ పడి రాజమౌళి ఈ అవార్డ్ అందుకున్నారు. 1935 నుంచి న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ ఈ  అవార్డ్స్ ఇస్తోంది. న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, ఆన్‌లైన్ పబ్లికేషన్స్ కు సంబంధించిన సభ్యులు ఒక బృందంగా ఏర్పడి ఈ అవార్డ్స్ ఇస్తున్నారు.

ఇటీవలే సన్‌సెట్‌ సర్కిల్‌ అవార్డుల్లో ఉత్తమ అంతర్జాతీయ సినిమా విభాగంలో ఆర్ఆర్ఆర్ విజేతగా నిలిచింది. బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో ఈ సినిమా మరో నాలుగు అంతర్జాతీయ చిత్రాలతో పోటీపడి ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఉత్తమ దర్శకుల విభాగంలో రాజమౌళి రన్నరప్‌గా నిలిచారు. బెస్ట్‌ ఎడిటింగ్‌ విభాగంలోనూ ఈ చిత్రం రన్నరప్‌గా ఉంది.

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ప్రధాన పాత్రల్లో రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ చిత్రం ఇటీవలే జపాన్ లో విడుదలై మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మొత్తం రూ.1200 కోట్లు సాధించింది. ఇప్పటికే శాటర్న్‌, సన్‌సెట్‌ సర్కిల్‌ వంటి పలు అంతర్జాతీయ అవార్డులు దక్కించుకున్న ఈ సినిమాను నేరుగా 14 కేటగిరీల్లో ఆస్కార్ కు పంపించేందుకు చిత్ర యూనిట్  ప్రయత్నాలు చేస్తోంది