- రూ.30 వేల కోట్లు ఖర్చు చేశాక మంత్రిత్వ శాఖను ఆశ్రయించారు
- ఈ ప్రాజెక్ట్‌కు టెక్నికల్ అప్రూవల్ మాత్రమే ఇచ్చాం.. నిధులు ఇవ్వకపోవడం మంచిదైంది
- కాళేశ్వరం లోపాలపై ఎంక్వైరీ జరుగుతున్నది
- డ్యాం పనుల విషయంలో వేసిన ఏజెన్సీ నత్తనడకన పని చేస్తున్నది
- అందువల్లే ప్రజలకు సకాలంలో నీళ్లందడం లేదు
- కాళేశ్వరంపై కాగ్ రిపోర్ట్ ఆధారంగా తీసుకున్న చర్యలను ప్రశ్నించిన ఎంపీ లక్ష్మణ్
న్యూఢిల్లీ, వెలుగు: గత బీఆర్ఎస్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి వెచ్చించిన దాదాపు రూ. లక్ష కోట్ల నిధులు నీళ్లపాలయ్యాయని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్ పేర్కొన్నారు. రూ. 30 వేల కోట్లు ఖర్చు చేసిన తర్వాత ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం టెక్నికల్ అప్రూవల్ కోసం తమ మంత్రిత్వ శాఖను ఆశ్రయించిందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం టెక్నికల్ అప్రైజల్ కమిటీ(టీఏసీ) అనుమతి మాత్రమే ఇచ్చిందని, నిధులు ఇవ్వకపోవడం మంచిదైందని వ్యాఖ్యానించారు.
ఈ మేరకు సోమవారం రాజ్య సభ క్వశ్చన్ అవర్‌లో కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. ప్రధాన మంత్రి కృషి సింఛాయి యోజన (పీఎంకేఎస్ వై) కింద తెలంగాణలో నీటి పారుదల ప్రాజెక్టుల అభివృద్ధిపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి మౌఖికంగా సమాధానం ఇచ్చారు. అనంతరం లక్ష్మణ్ సప్లిమెంటరీ ప్రశ్నలో భాగంగా... కాళేశ్వరం ప్రాజెక్ట్ సాధ్యాసాధ్యాలకు సంబంధించి ‘కాగ్ ఫస్ట్ రిపోర్ట్ –2024’ లోని అంశాలను లేవనెత్తారు.
‘‘కాళేశ్వరం ఆర్థికంగా ఆచరణకు సాధ్యమైంది కాదు. ప్రాథమిక అంచనా కన్నా.. దాదాపు 80 శాతం ఈ ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది. దాదాపు రూ. 1.47 లక్ష కోట్లకు ఈ ప్రాజెక్ట్ కాస్ట్ చేరింది’’ అని రిపోర్ట్‌లోని అంశాలను సభలో సీఆర్ పాటిల్ చదివి వినిపించారు. ఈ అబ్జర్వేషన్లపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని కేంద్రాన్ని ప్రశ్నించారు. అలాగే, కాళేశ్వరానికి సంబంధించి తాజా పరిస్థితిని వివరించాలని కోరారు. జల్ జీవన్ మిషన్, ఇతర స్కీమ్‌ల కింద తెలంగాణకు కేంద్రం అందించిన ఆర్థిక సహకారంపై ప్రశ్నించారు. ఇందుకు కేంద్ర మంత్రి బదులిస్తూ...‘‘కాగ్ రిపోర్ట్‌లు రాష్ట్రానికి వెళ్తాయి. ఈ రిపోర్ట్‌లకు రాష్ట్రాలే జవాబుదారీగా ఉంటాయి. అయితే, కాళేశ్వరానికి సంబంధించి రాష్ట్రం నుంచి ఎలాంటి కాగ్ రిపోర్ట్ తమకు అందలేదు’’ అని స్పష్టం చేశారు.
జల్ జీవన్ మిషన్ నిధుల వినియోగంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అన్నారు. ఈ స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి తీసుకోనందున.. దీనిపై తమ మంత్రిత్వ శాఖ వద్ద ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. గత మూడేండ్లుగా ఈ స్కీమ్స్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని తెలిపారు. అయినప్పటికీ... ‘పర్ డ్రాప్ మోర్ క్రాప్’ (పీడీఎంసీ) కింద తెలంగాణకు మొత్తం రూ. 873.95 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. అందులో గత మూడేండ్లలో రూ. 194.63 కోట్లు అందించినట్టు వివరించారు.
కాళేశ్వరం నీటిలో కొట్టుకుపోయింది: కేంద్ర మంత్రి పాటిల్
అనంతరం లక్ష్మణ్ ప్రశ్నకు అనుబంధంగా కేఆర్ సురేశ్ రెడ్డి సప్లిమెంటరీ ప్రశ్న అడిగారు. రాష్ట్ర విభజన సందర్భంలో ఏపీ, తెలంగాణకు రెండు జాతీయ ప్రాజెక్ట్‌లు ఇవ్వాలని ఉందన్నారు. ఇందులో ఏపీ నుంచి పోలవరం ప్రాజెక్ట్ ను జాతీయ ప్రాజెక్ట్ గా గుర్తించారని, తెలంగాణ నుంచి ఒక్క ప్రాజెక్ట్ కు నేషనల్ హోదా ఇవ్వలేదన్నారు. కాళేశ్వరం లేదా ఇతర ఏ ముఖ్యమైన ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వాలని కోరారు.
అయితే... కాంగ్రెస్ పాలనలో గడిచిన రెండేండ్లలో తెలంగాణలో చాలా వరకు ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు అమలు కావడం లేదని విమర్శించారు. ఇందుకు కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ బదులిస్తూ.. ‘‘సహచర సభ్యులు డ్రింకింగ్ వాటర్ పేరుతో ఇరిగేషన్‌కు సంబంధించి ప్రశ్నను లేవనెత్తారు. కాళేశ్వరానికి సంబంధించి జలవనరుల శాఖ పరిధిలోని అంశాలకు సమాధానం ఇస్తాను.
కాళేశ్వరం కోసం రూ. 30 వేల కోట్లు ఖర్చు చేశాక అఫ్రూవల్ కోసం మా శాఖకు ప్రతిపాదన వచ్చింది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి టెక్నికల్ అఫ్రూవల్ మాత్రమే పూర్తి చేసి ఇచ్చాం. ఆ తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం మా నుంచి ఒక్క రూపాయి తీసుకోలేదు. అయితే, ప్రస్తుతం కాళేశ్వరం పరిస్థితి ఏంటో దేశం మొత్తానికి తెలుసు. దాదాపు రూ. లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించిన ఈ ప్రాజెక్ట్, ప్రస్తుతం నీటిలో కొట్టకుపోయింది. కాళేశ్వరం లోపాలపై విచారణ కూడా జరుగుతున్నది. ఈ ప్రాజెక్ట్ విషయంలో బోర్ వేల్స్ వేసి, కొత్తగా ఈ ప్రాజెక్ట్ ను ఎలా ముందుకు తీసుకెళ్లాలని అనే అంశంపై పని చేస్తున్నాం.
ఈ విషయంలో సర్వే చేస్తున్న ఏజెన్సీ చాలా నత్తనడకన పనులు చేస్తున్నది. దీని కారణంగా ప్రజలకు నీళ్లు ఇంకా అందడం లేదు. ఈ ప్రాజెక్ట్ కోసం జల్ జీవన్ మిషన్ నుంచి నిధులు తీసుకోలేదు. అందువల్ల ఈ ప్రాజెక్ట్ నిధుల విషయంలో మా దగ్గర ఎలాంటి సమాచారం లేకపోవడం మంచిదైంది.
కానీ జల్ సింఛాయ్, జల్ భాగిధారి ప్రోగ్రాంలో తెలంగాణ మంచిపనితీరు కనబర్చింది. అందుకు తగ్గట్టుగా అధిక నిధులతో పాటు రూ. 2 కోట్ల బహుమానం కూడా దక్కింది’’ అని బదులిచ్చారు. సప్లిమెంటరీ ప్రశ్న కింద మరోసారి సురేశ్‌రెడ్డి స్పందిస్తూ... ‘పర్ డ్రాప్ మోర్ క్రాప్’ (పీడీఎంసీ)’ కింద తెలంగాణ కు కేటాయించిన నిధుల వివరాలను చెప్పాలని కేంద్ర మంత్రిని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం: ఎంపీ అనిల్
పార్లమెంట్ వేదికగా బీఆర్ఎస్, బీజేపీ ఫ్రెండ్‌షిప్ మరోసారి స్పష్టమైందని కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ విమర్శించారు. ఇందుకు తగ్గట్టుగా కాళేశ్వరం, జల్ జీవన్ మిషన్ నిధుల విషయంలో ఈ ఇరు పార్టీల ఎంపీలు.. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రతిపాదనలు పంపలేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పథకాల్ని అమలు చేయడం లేదని బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్‌రెడ్డి సభకు వివరించారన్నారు.
ఈ వ్యాఖ్యలు పరిశీలిస్తే.. ఇరు పార్టీల ఫ్రెండ్‌షిప్ స్పష్టమవుతున్నదని విమర్శించారు. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దీనిపై కేంద్ర మంత్రి స్పందిస్తూ.. ‘‘కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు కేవలం సాంకేతిక సహకారానికి మాత్రమే అనుమతి ఇచ్చాం. ఆ తర్వాత ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం బయటి నుంచి నిధులు తీసుకోవచ్చు. లేదా కేంద్ర ప్రభుత్వాన్ని కోరవచ్చు. అవి 60:40 లేదా ఇతర నిష్పత్తిలో రుణాలు పొందవచ్చు’’ అని క్లారిటీ ఇచ్చారు.
