హెల్త్ చెకప్‌లో డాక్టర్ నిర్లక్ష్యం.. 10 లక్షల జరిమానా

హెల్త్ చెకప్‌లో డాక్టర్ నిర్లక్ష్యం.. 10 లక్షల జరిమానా
  • బాధితులకు పరిహారంగా చెల్లించాలని కన్జ్యూమర్ ఫోరం తీర్పు
  • గర్భస్థ పిండంలో లోపాలు గుర్తించని డాక్టర్.. జన్యులోపంతో పుట్టిన బిడ్డ

హైదరాబాద్, వెలుగు: గర్భస్థ పిండంలోని లోపాలను డాక్టర్ గుర్తించకపోవడంతో బిడ్డ జన్యులోపంతో పుట్టింది. దీంతో బాధితులు కన్జ్యూమర్ ఫోరంను ఆశ్రయించగా, డాక్టర్‌‌కు రూ.10 లక్షల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని 30 రోజుల్లో బాధితులకు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ​మండలం మధుబన్ ​కాలనీకి చెందిన ఒక మహిళ గర్భవతి అయిన మూడో నెల నుంచి (ఫిబ్రవరి 2012) మోతీనగర్‌‌లోని ఓ హాస్పిటల్‌లో ప్రతినెలా చెకప్ చేయించుకున్నారు. ఆ ఏడాది జులై వరకు డాక్టర్ ఆమెకు రెగ్యులర్‌‌గా స్కానింగ్ చేశారు. అయితే  ఆగస్టులో వెళ్లగా, చందానగర్​లోని  మరో హాస్పిటల్‌కు వెళ్లాలని సూచించారు. అక్కడ టిఫ్ఫా స్కాన్ చేసిన డాక్టర్.. గర్భంలోని శిశువుకు లోపం ఉన్నట్లు గుర్తించారు. తాను అడ్మిట్ చేసుకోబోనని తిరిగి పంపించారు. దీంతో ముందు నుంచి చెకప్ చేయించుకున్న హాస్పిటల్‌లోనే ఆ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే స్పైనా బెఫిడా (వెన్నెముక సమస్య) అనే జన్యులోపంతో బిడ్డ పుట్టింది. డాక్టర్ సూచనతో బిడ్డను మరో హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ బిడ్డకు వెన్నెముక సర్జరీ చేసినా ఫలితం లేకుండా పోయింది.

అప్పీల్ కొట్టివేత..

తాము చెకప్‌కు వెళ్లిన నాలుగైదు నెలల టైమ్‌లోనే డాక్టర్ టిఫ్ఫా స్కానింగ్ చేసి ఉంటే, సమస్య బయటపడేదని బాధితులు వాపోయారు. డాక్టర్ ​నిర్లక్ష్యం కారణంగానే బిడ్డ జన్యులోపంతో పుట్టిందని 2014లో రంగారెడ్డి జిల్లాలోని కన్జ్యూమర్ ఫోరంను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ఫోరం బాధితులకు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని 2016లో ఆదేశించింది. అయితే దీనిపై డాక్టర్ అప్పీల్ చేశారు. ఆ అప్పీల్ చెల్లదని ఫోరం ప్రెసిడెంట్ ఎంఎస్​కే జైశ్వాల్, మెంబర్​ మీనా రామనాథన్ ​గురువారం కొట్టేశారు. బాధితులకు రూ.10 లక్షలతో పాటు 2016 నుంచి 9% వడ్డీ, కోర్టు ఖర్చులకు మరో రూ.5 వేలు చెల్లించాలని ఆదేశించారు. ఈ మొత్తాన్ని చిన్నారి పేరిట పోస్టాఫీసులో ఫిక్స్​డ్​ డిపాజిట్ చేయాలని, చిన్నారి పోషణకు వడ్డీని మాత్రమే డ్రా చేయాలని తీర్పులో పేర్కొన్నారు.