
పాట్నా: బిహార్లో నిరుద్యోగ పట్టభద్రులకు నెలకు రూ.1,000 చొప్పున రెండేండ్లపాటు భృతి ఇస్తామని ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ ప్రకటించారు. ‘‘సీఎం స్వయం సహాయక భృతి పథకం’’ కింద నిరుద్యోగ భృతి ఇంటర్మీడియట్ పాస్ అయినవారికి ఇదివరకే అమలు చేస్తుండగా.. ఇకపై దాన్ని డిగ్రీ పాస్ అయిన వారికీ విస్తరిస్తున్నామని వెల్లడించారు. గురువారం ఆయన ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. 20 ఏండ్ల నుంచి 25 ఏండ్ల మధ్య వయస్సు ఉన్న గ్రాడ్యుయేట్లు, ఆపై చదువులు మానేసిన, ఉద్యోగం లేని, స్వయం ఉపాధి లేనివారికి ఈ సాయం అందుతుందని తెలిపారు.
తమ ప్రభుత్వం ఉద్యోగ కల్పన, ఉపాధి అవకాశాలను అత్యంత ప్రాధాన్యంగా చూస్తున్నదని సీఎం చెప్పారు. అలాగే, నిర్మాణ రంగ కార్మికులకూ ఆర్థిక సహాయం ప్రకటించారు. బుధవారం విశ్వకర్మ పూజ, ప్రధాని మోదీ బర్త్ డే సందర్భంగా 16.04 లక్షల మంది కార్మికులకు ఒక్కొక్కరికి రూ.5,000 చొప్పున నగదు బదిలీ చేశారు. బిహార్ ప్రభుత్వ వార్షిక దుస్తుల సహాయ పథకం కింద రూ.802.46 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.