కరోనా నిబంధనల ఉల్లంఘన: రెండ్రోజుల్లో కోటిన్నర ఫైన్లు

కరోనా నిబంధనల ఉల్లంఘన: రెండ్రోజుల్లో కోటిన్నర ఫైన్లు

ఓ వైపు కరోనా కేసులు పెరుగుతున్నాయి.. మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ముంచుకొస్తోంది. వైరస్ వ్యాప్తిని నియంత్రించలేకపోతే రోజూ లక్షల్లో కేసులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలు పక్కాగా పాటించాలని, మాస్కు పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని, గుంపులగా చేరొద్దని ప్రభుత్వాలు అప్రమత్తం చేస్తున్నాయి. అయినా సరే ఆ నిబంధనలన పాటించే విషయంలో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. కరోనా నిబంధనలను ఉల్లంఘించినందుకు రెండ్రోజుల్లోనే రూ.కోటిన్నర ఫైన్ల వసూలు చేసినట్లు ఢిల్లీ ప్రభుత్వ అధికారులు తెలిపారు. అలాగే నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి 163 ఎఫ్‌ఐఆర్‌‌లు నమోదయ్యాయని చెప్పారు. మాస్క్‌ పెట్టుకోకపోవడం, ఫిజికల్ డిస్టెన్స్ పాటించకపోవడం, మాస్ గ్యాదరింగ్స్‌కు సంబంధించిన ఉల్లంఘనలు 7,778 నమోదయ్యాయని పేర్కొన్నారు.

కాగా, దేశంలో ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. కరోనా కొత్త వేరియెంట్ బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 415కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో అత్యధికంగా మహారాష్ట్రలో 108 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 79, గుజరాత్ లో 43, తెలంగాణలో 38, కేరళలో 37, తమిళనాడు 34, కేరళ 31, రాజస్థాన్ 22, హర్యానా, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ లలో 4, జమ్మూ కాశ్మీర్, బెంగాల్ లో 3, యూపీలో 2, చండీఘడ్, లద్దాఖ్, ఉత్తరాఖండ్ లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. మొత్తం 415 మంది బాధితుల్లో 115 మంది ఒమిక్రాన్ నుంచి కోలుకున్నారు.