పంట నష్టంపై ఇంకా సర్వే చేపట్టని రాష్ట్ర సర్కారు

పంట నష్టంపై ఇంకా సర్వే చేపట్టని రాష్ట్ర సర్కారు
  • పునాస పంటలు ఆగం
  • వానలతో 5 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
  • రూ.1500 కోట్ల పంట నష్టం
  • ఇంకా సర్వే చేపట్టని రాష్ట్ర సర్కారు
  • పంట నష్టాలకు ఆరేండ్లుగా పైసా ఇయ్యలే
  • ఫసల్ ​బీమాకు ప్రీమియం కడ్తలే.. 
  • రైతులకు ఆగిన రూ. 960 కోట్ల పరిహారం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో వారం రోజుల పాటు తెంపులేకుండా కురిసిన వర్షాలకు పంటలు ఎక్కడియక్కడ ఆగమైనయి. రైతు సంఘాల లెక్కల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అయిదున్నర లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగితే అందులో 4 లక్షల ఎకరాల్లో పత్తి పంటకు నష్టం జరిగింది. 50 వేల ఎకరాల్లో వరి, మరో లక్ష ఎకరాల్లో ఇతర పంటలు వరద పాలయ్యాయి. విత్తనాలు, ఎరువులు, దున్నకాలు, కూలి ఖర్చులు కలిపి ఎకరాకు రూ.30 వేల చొప్పున పెట్టుబడి వేసుకున్నా.. 5 లక్షల ఎకరాలకు రూ.1500 కోట్ల వరకు నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా. ఇంత జరిగినా.. సర్కారు  కనీసం పంట నష్టం వివరాలు కూడా సేకరించడం లేదు. ‘అయ్య పెట్టడు.. అడుక్కోనియ్యడు’ అన్నట్లు.. అకాల వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతులకు ఆరేండ్లుగా పైసా పరిహారం ఇయ్యని రాష్ట్ర సర్కారు.. కేంద్రం తెచ్చిన ఫసల్​బీమాను కూడా అమలు చేస్తలేదు. ఫైనాన్స్​కమిషన్​ సిఫారసుల మేరకు ప్రకృతి విపత్తులతో పంటనష్టం జరిగితే నష్టం లెక్కించి  ఇన్‌‌‌‌పుట్‌‌‌‌ సబ్సిడీ ఇవ్వాల్సి ఉన్నా.. సర్కారు నుంచి ఎలాంటి సాయం అందటం లేదు. దీంతో పంట మునిగితే  రైతు మునుగుడే అనే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఈ సారీ వానలు ముందే కురవడంతో జూన్‌‌‌‌ మొదటి వారంలోనే రైతులు పంటలు వేశారు. విత్తి నెల రోజులు కూడా గడవకముందే వర్షాలు బాగా పడటంతో పత్తి, మొక్కజొన్న, పెసర, కంది పంటలు మొలక దశలోనే దెబ్బతిన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రైతులు 48.77 లక్షల ఎకరాల్లో పత్తి, 13.74 లక్షల ఎకరాల్లో వరి, 5.17 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 8.36 లక్షల ఎకరాల్లో కందులు, 1.21 లక్షల ఎకరాల్లో పెసర, 3.38 లక్షల ఎకరాల్లో సోయా పంటలు వేశారు. వేసిన పంటల్లో పప్పు ధాన్యాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పత్తి విత్తనాలు మళ్లీ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో నాటు వేసిన వరి, నారు మడులు ఒండ్రుపట్టి దెబ్బతిన్నాయి.

పత్తికి పెద్ద దెబ్బ
తెలంగాణ పత్తికి మార్కెట్​లో మంచి డిమాండ్ ఉంది.. రైతులందరూ పత్తి సాగు చేయాలని ప్రభుత్వం చెప్పడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి పత్తి సాగు పెరిగింది. ఆశించిన దాని కంటే ఎక్కువ వర్షాలు కురవడంతో వరి పంటలు నీట మునగగా, పత్తి, పసుపు చేన్లు జాలుపట్టి పట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిన్నది. తెరిపి లేకుండా వానలు పడటంతో చెల్కల్లో జాలు పుట్టింది. దీంతో చేను ఎర్రపడటం, వేరుకుళ్లు, జాజు తెగులు సోకుతున్నయి.  జనగామ, సూర్యాపేట, నల్గొండ, ఆదిలాబాద్‌‌‌‌, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌‌‌‌, వరంగల్‌‌‌‌ రూరల్‌‌‌‌, అర్బన్‌‌‌‌ జిల్లాలు సహా ఎక్కడ చూసినా మశిపేనుతో ఆకులు ముడత బారి పత్తి చేనులో ఎదుగుదల లేదు. పునాస సంటలు పెసర, కందులు, నువ్వులు, వేరుశనగ, సోయాబీన్ పంటలు ధ్వంసమయ్యాయి. 5 వేలకు పైగా ఎకరాల్లో  కూరగాయ పంటలకు నష్టం జరిగింది. ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.

పంట బీమా అమలు ఏదీ?
ప్రకృతి విపత్తులతో పంట దెబ్బతింటే పరిహారం అందించేలా కేంద్ర ప్రభుత్వం ఫసల్‌ బీమా యోజన పథకం అమలు చేస్తోంది. 2016 ఖరీఫ్​లో  ఈ పథకం ప్రారంభమైంది. దీనికి సంబంధించి బీమా ప్రీమియంతో రైతు వాటా పోను మిగతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం వాటా ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. ఫసల్‌ బీమా ప్రారంభమైన రెండేళ్ల పాటు రాష్ట్ర సర్కారు బీమా ప్రీమియం వాటా చెల్లించింది. 2018-–19, 2019-–20 సంవత్సరాల్లో రాష్ట్ర వాటా చెల్లించలేదు. వాటా చెల్లించక పోవడంతో బీమా కంపెనీలు పంటనష్ట పరిహారం ఇవ్వడం లేదు. పెండింగ్‌లో ఉన్న రెండేళ్ల ప్రీమియం రూ.513.50 కోట్లు చెల్లించక రైతులకు సంబంధించిన బీమా పరిహారం రూ.960కోట్లు ఆగిపోయింది. 2020–-21 నుంచి పూర్తిగా ఫసల్‌ బీమా నోటిఫికేషన్‌ ఇవ్వకుండా నిలిపివేసింది. 

ఈయేడు ప్రారంభంలోనే..
 రెండు ఎకరాల్లో పత్తి, మరో రెండు ఎకరాల్లో పసుపు పెట్టిన. మొన్నటి వానలకు పత్తి చేన్లు మొత్తం జాలుపట్టి చేను ఎర్రబారింది. పసుపు చేనుది అదే పరిస్థితి. తెరిపి లేకుండా పడ్డ వానలు పంటలను కోలుకోలేని దెబ్బతీశాయి. రైతు నష్టపోయే పరిస్థితి ఉంది. పంటకు నష్టం జరిగితే సర్కారు సాయం జేసుడే మరిచిపోయింది.
- కోరె  శ్రీనివాస్‌‌‌‌, రైతు, ఆలేరు, మహబూబాబాద్‌‌‌‌ జిల్లా

పంటలు నీట మునిగాయి
వాజేడు, వెంకటాపురం, ఏటూరునాగారంలలో మిర్చి నార్లపై వర్షాల ఎఫెక్ట్‌‌‌‌పడింది.ఈసారి మిర్చి తోటలు పెట్టేందుకు ఇబ్బందులు తప్పేలా లేవు.  రామప్ప, లక్నవరం పరిధిలో నీటి వరద పెరిగి సాగు భూములు నీటమునిగాయి. గుండ్ల వాగు ప్రాజెక్టు కింద నాట్లు పడలేదు. చాలా ముంపు ప్రాంతాల్లో వరి నాట్లేసే పరిస్థితి లేదు. దాదాపు వందలాది ఎకరాలు ముంపునకు గురయ్యాయి. పత్తి చేన్లు దెబ్బతిన్నయి.
- గఫూర్‌‌‌‌, కాసీంపేట, ములుగు జిల్లా