ఇండియాలో రూ.15వేల కోట్లు పెట్టుబడి ప్రకటించిన ఫాక్స్‌కాన్‌.. 14వేల కొత్త జాబ్స్..

ఇండియాలో రూ.15వేల కోట్లు పెట్టుబడి ప్రకటించిన ఫాక్స్‌కాన్‌.. 14వేల కొత్త జాబ్స్..

ఆపిల్ ఐఫోన్ తయారీదారు ఫాక్స్‌కాన్‌ కంపెనీ తమిళనాడులో భారీ పెట్టుబడిని ప్రకటించింది. దీని కింద సంస్థ దాదాపు రూ.15వేల కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా కొత్తగా 14వేల మందికి ఉద్యోగాలను సృష్టించనున్నట్టు తెలియజేశారు. ఫాక్స్‌కాన్‌ కంపెనీ ప్రధానంగా ఐఫోన్లు, ఐప్యాడ్స్ లాంటి ప్రముఖ ఎలక్ట్రానిక్ పరికరాల తయారు చేసే సంస్థగా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. 

తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ ఈ పెట్టుబడిని దేశీయ ఆర్థికాభివృద్ధికి ప్రేరణగా భావిస్తున్నట్లు వెల్లడించారు. ఫాక్స్‌కాన్‌ కాంచీపురం జిల్లాలో మొబైల్ ఫోన్ల విడిభాగాల తయారీకి రూ.16వందల కోట్ల పెట్టుబడితో ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్టు నిర్ణయించింది. ఈ ప్లాంట్ ద్వారా సుమారు 6వేల మందికి ఉద్యోగాలు వస్తాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఫాక్స్‌కాన్‌కు శ్రీపెరంబుదూర్ ప్రాంతంలో కూడా ఐఫోన్ తయారీ ప్లాంట్ కలిగి ఉంది. అక్కడి ఉద్యోగుల సంఖ్య 35 వేలకి చేరింది. ప్రస్తుతం సంస్థ దాని కార్యకలాపాలను విస్తరించి మరిన్ని స్థలాల్లో పెట్టుబడులు పెడుతూ భారతదేశంలో ముందుకు సాగుతోంది. 

ఈ పెట్టుబడి ద్వారా మాత్రమే కాకుండా.. 18వేలకు పైగా మహిళా కార్మికులకు ప్రత్యేకంగా రూ.700 కోట్లు విలువైన పారిశ్రామిక ప్రాజెక్టులనూ ప్రారంభిస్తున్నట్టు సమాచారం. దీనివల్ల సామాజికంగా మహిళల కూడ ఉద్యోగ అవకాశాలు మెరుగై, ఆర్థిక స్వావలంబన పెరుగుతుంది.

ఫాక్స్‌కాన్‌ అనుసరిస్తున్న 'చైనా ప్లస్ వన్' వ్యూహం ప్రస్తుతం భారతదేశంలో కూడా ఉత్పత్తి పెంపు, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ దేశీయ ఉత్పత్తుల పెంపు కేంద్రంగా కొనసాగుతోంది. ఈ మెగా ప్లాన్ లో భాగంగానే తమిళనాడు యూనిట్‌కు భారీ పెట్టుబడులు పెడుతూ, సాంకేతికత వృద్ధిని జోడిస్తోంది తైవాన్ సంస్థ. దీంతో ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రస్తుతం తమిళనాడు  దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఎగుమతుల్లో నెంబర్ 1గా ఉండగా.. 2030 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ లక్ష కోట్ల డాలర్లకు పెరిగేలా ప్రణాళికలు రూపొందిస్తోంది తమిళనాడు.

ఈ పెట్టుబడితోపాటు "ఫాక్స్‌కాన్ డెస్క్" అనే ప్రత్యేక విభాగం కూడా ప్రారంభనమవుతోంది. ఇది రాష్ట్రంలో పెట్టుబడులను సులభతరం చేసేందుకు, నూతన ప్రాజెక్టుల నిర్వహణ కోసం సదుపాయాలను అందిస్తుంది. ఇది మరింత వేగంగా ప్రాజెక్టుల అమలుకు సహాయకారిగా నిలుస్తుందని తేలింది. ఈ పెట్టుబడులు తమిళనాడును ప్రపంచ స్థాయి గుర్తింపు దిశగా అడుగులు వేస్తున్నాయి.